పార్టీ జెండా గద్దె కూల్చేశారనే మనస్తాపంతో ఇటీవల ఖమ్మంలోని పోలీసు ఠాణా ఆవరణలో భాజపా కార్యకర్త సామినేని సాయిగణేశ్ బలవన్మరణం చెందగా.. అతడిని ప్రేమించిన యువతి మనస్తాపంతో శనివారం(ఏప్రిల్ 30న) ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన.. ఖమ్మంలో మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది. "నీతో మాట్లాడకుండా ఉండలేను. నాకు పిచ్చిపట్టినట్టు ఉంది. నువ్వు లేవు అన్న బాధ కంటే.. నేను ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నాను అనే ఆవేదనే నన్ను బాగా ఇబ్బంది పెడుతోంది. నువ్వు నా దగ్గరకు రావు కదా. అందుకే నేనే వస్తున్నా. నీవు లేని జీవితం వద్దు.." అని సాయిగణేశ్‌ను ఉద్దేశించి పేర్కొంటూ ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టారు.
'నీవు లేని జీవితం వద్దు.. నీ దగ్గరికే వస్తున్నా..' సాయిగణేశ్ ప్రేమికురాలు ఆత్మహత్యాయత్నం
ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కులాలు వేరైనా పెద్దలను ఒప్పించారు. నిశ్చితార్థం చేసుకొని వివాహానికి సిద్ధమవుతున్నారు. అంతా సాఫీగా సాగిపోతున్న సినిమాలో ఊహించని ట్విస్ట్ వచ్చినట్టు.. వీరి జీవితంలోనూ తేరుకోలేని విషాదం నెలకొంది. తాను నమ్ముకున్న పార్టీకి అవమానం జరిగిందని.. పోలీసులు వేధించారని.. అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించినవాడు ఒంటరిగా విడిచి వెళ్లిపోయాడన్న బాధతో అమ్మాయి కూడా బలవన్మరణానికి యత్నించింది.
సాయగణేశ్.. ఏప్రిల్ 14న బలవన్మరణానికి యత్నించగా 16న మృతి చెందిన విషయం విదితమే. వీరి వివాహం మే 4న జరగాల్సి ఉంది. ప్రేమికురాలు ఖమ్మం జిల్లా సింగరేణి మండల వాసి. ఆమె గ్రామం.. జిల్లా కేంద్రానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆమె అక్కణ్నుంచి వచ్చి శనివారం సాయంత్రం నిద్రమాత్రలు మింగింది. సాయిగణేశ్ నిర్మించిన భాజపా దిమ్మెను కూలగొట్టిన ప్రాంతంలోనే ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు, భాజపా కార్యకర్తలు అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జిల్లా ఎక్సైజ్ కోర్టు మెజిస్ట్రేట్ శాంతిలత ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. చికిత్స పొందుతున్న ఆమెను చూసేందుకు కుటుంబసభ్యులు, భాజపా, అనుబంధ కమిటీల వారు భారీగా తరలి వచ్చారు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇవీ చూడండి: