రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ గుట్కా, పొగాకు సంబంధించిన అక్రమ రవాణా, వ్యాపారం జరుగుతూనే ఉంది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన కర్ణాటకలోని బీదర్, మహారాష్ట్రలోని నాందేడ్ కేంద్రంగా గుట్కా, పొగాకు అక్రమ కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో గుట్కాను నియంత్రించేందుకు హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
అదుపులో 32 మంది
పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గుట్కాకు రవాణా క్రయ విక్రయాలకు సంబంధించి నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో సౌత్, ఈస్ట్ జోన్ పోలీసులు... 31 కేసులకు సంబంధించి మొత్తం 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.30,18,000 విలువైన నిషేధిత గుట్కా, పాగాకు ఉత్పత్తులను సీజ్ చేశారు. గురువారం నాడు ముందస్తు సమాచారం మేరకు సౌత్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం... రెండు కేసుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. మొదటి కేసులో బండ్లగూడకు చెందిన అబూబకర్ అలియాస్ జుమాలీని, రెండో కేసులో బార్కాస్‌కు చెందిన అబూబకర్, ఓమర్ బిన్ అలీలను అరెస్టు చేశారు. వారి ముగ్గురి దగ్గరి నుంచే మొత్తం 10 లక్షల విలువైన పొగాకు ఉత్పత్తులను సీజ్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
70 లక్షల సరకు సీజ్
ఇవాళ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ నార్త్‌జోన్ బృందం బేగం బజార్‌లోని షాహినత్ గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుట్కా రవాణాకు సంబంధించి... ట్రాప్ వేసి రాజస్థాన్‌కు చెందిన ఓ లారీని పట్టుకున్నారు. అందులో ఉన్న రూ.70 లక్షల విలువైన పొగాకు, సిగరెట్లను పోలీసులు సీజ్ చేశారు. స్వాగత్ గోల్డ్, హన్స్, జేకేఆర్ తదితర బ్రాండ్లతో పొగాకు అమ్ముతున్నారని మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు.