Chit Fund Fraud in Guntur: ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన వ్యాపారి వెంకటేశ్వరరావు 20ఏళ్లకు పైగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నారు. దీంతో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేసేవారు. ఇవాళ ఉదయం ఇంటికి తాళం వేసి ఉండటంతో అందరూ అనుమానించారు. ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదు.
అప్రమత్తమైన బాధితులు విచారించగా ఇళ్లతో పాటు ఇతర ఆస్తులను అమ్మేసినట్లు తేలింది. కుటుంబంతో సహా వెంకటేశ్వరరావు పారిపోయారని గుర్తించిన బాధితులు లబోదిబోమంటున్నారు. 20 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారని బాధితులు చెబుతున్నారు. చిట్టీల సమయం ముగిసినా వాటిని ఇవ్వలేదని.. వడ్డీ ఇస్తానని చెప్పి నమ్మించాడని వాపోయారు. అంతా ప్రణాళిక ప్రకారమే మోసం చేశాడని బాధితులు ఆరోపించారు. తమ కష్టార్జితాన్ని కొల్లగొట్టిన వెంకటేశ్వరరావును పట్టుకోవాలని బాధితులు.. మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.