తెలంగాణ

telangana

ETV Bharat / crime

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.11.57 కోట్ల విలువైన కొకైన్‌ పట్టివేత - Drugs Seized at RGIA

cocaine
cocaine

By

Published : Apr 26, 2022, 5:14 PM IST

Updated : Apr 26, 2022, 7:19 PM IST

17:12 April 26

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.11.57 కోట్ల విలువైన కొకైన్‌ పట్టివేత

పట్టుబడిన కొకైన్

Cocaine Seized at Shamshabad: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న, ఇవాళ పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. సోమవారం రూ. 21.90 కోట్లు విలువైన 3.129 కిలోల హెరాయిన్‌, ఇవాళ రూ.11.57 కోట్ల విలువైన 1,157 గ్రాముల కొకైన్‌ పట్టుబడింది. డీఆర్‌ఐ హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ అధికారులు నిఘా వర్గాల సమాచారంపై నైరోబి దేశీయురాలు పెంజానీ, టాంజానియా దేశస్థుడు సాలెపై ఎన్డీపీఎస్‌ చట్టం కింద రెండు కేసులు నమోదు చేసి వారిద్దరిని రిమాండ్‌కు తరలించారు.

కడుపులో 79 క్యాప్సుల్స్‌:ఇవాళ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా మాదకద్రవ్యాలు డీఆర్‌ఐ అధికారులకు పట్టుబడ్డాయి. నిఘా వర్గాల సమాచారంతో జోహెన్స్‌బర్గ్‌ నుంచి దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌ వచ్చిన టాంజానియా దేశస్థుడు సాలెను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు ఈనెల 21న హైదరాబాద్‌ వచ్చిన సాలెను అదుపులోకి తీసుకుని పరీక్షించగా కడపులోకి కొకైన్‌ క్యాప్సుల్స్‌ మింగినట్లు గుర్తించారు. అదే రోజున 22 క్యాప్సుల్స్‌ను వైద్యుల సహాయంతో బయటకు తీశారు. మరో 57 క్యాప్సుల్స్‌ను అయిదు రోజుల వ్యవధిలో వైద్యుల పర్యవేక్షణలో కడుపులో నుంచి వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం స్వాధీనం చేసుకున్న 79 క్యాప్సుల్స్‌ తూకం వేయగా 1,157 గ్రాములు కొకైన్‌ ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ మొత్తం కొకైన్‌ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.11.57 కోట్లు విలువ పలుకుతుందని వివరించారు. టాంజానియా దేశస్థుడిపై ఎన్డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

లగేజిలో హెరాయిన్:నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో ఈనెల 24న నైరోబి నుంచి హైదరాబాద్‌ వచ్చిన పెంజానీ లగేజిని డీఆర్‌ఐ అధికారులు తనిఖీ చేశారు. ట్రాలీ బ్యాగ్‌ అడుగు భాగాన రెండు ప్లాస్టిక్‌ కవర్లలల్లో తెల్లటి పౌడర్‌ లభ్యమైంది. వెంటనే పెంజానీ అనే ప్రయాణీకురాలిని అదుపులోకి తీసుకున్నారు. నైరోబి నుంచి డోహ్‌ మీదుగా బిజినెస్‌ వీసాపై హైదరాబాద్‌ వచ్చిన మాలవ్యన్‌ దేశస్థురాలు డీఆర్‌ఐ అధికారుల కళ్లు గప్పి బయట పడేందుకు యత్నించారు. బిజినెస్‌ వీసాపై రావడంతో నిఘా సంస్థలు అంతగా పట్టించుకోవని ఆమె భావించారు. కాని ముందుగానే డీఆర్‌ఐ అధికారుల వద్ద సమాచారం ఉండడంతో ఆమె లగేజిని పూర్తి స్థాయిలో సోదాలు చేశారు. పట్టుబడిన తెల్లటి పౌడర్‌ను పరీక్షలు చేయగా అది హెరాయిన్‌ అని తేలింది. పట్టుబడిన 3.129 కిలోల హెరాయిన్‌ అంతర్జాతీయ మార్కెట్లో రూ.21.90 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. వెంటనే ఆ ప్రయాణీకురాలిని అరెస్టు చేసిన డీఆర్‌ఐ అధికారులు... జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించారు.

రెండు రోజుల్లో భారీగా స్వాధీనం: రెండు రోజుల్లో రూ.33.47 కోట్లు విలువైన 3.129కిలోల హెరాయిన్‌, 1,157 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ అధికారులు... ఇద్దరు ప్రయాణీకులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి రాబట్టిన సమాచారంపై మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌కు తరలించిన ఈ మాదకద్రవ్యాలు ఇక్కడ స్థానికంగా ఎవరికైనా విక్రయించేందుకా? లేక ఇక్కడ నుంచి బయట రాష్ట్రాలకు కాని, దేశాలకుకాని తరలించేందుకు వేసిన ఎత్తులా అన్నదానిపై ఆరా తీస్తున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Apr 26, 2022, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details