rowdy sheeter kidnaps a girl in Vijayawada విజయవాడలోని గుణదల వెంకటేశ్వరనగర్‌లోని రైవస్ కాలువ కట్ట అక్కడకు సమీపంలోని ఇంట్లో 17 ఏళ్ల బాలిక చంటి పాపను ఆడిస్తోంది. ఏమైందో ఏమో.. హఠాత్తుగా చిన్నారిని ఇంట్లో ఉన్న అక్కకు ఇచ్చింది. ఇప్పుడే వస్తాను అని చెప్పి.. ఇంటి నుంచి బయటకు వచ్చింది. పరుగున కాలువ వద్దకు వచ్చి, అందులోకి దూకింది. నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడం చూసి చుట్టుపక్కల వారు చూసి బాలిక అక్కకు సమాచారం ఇచ్చారు.
ఆ వెంటనే గుణదల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పిపోయినట్లుగా కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అప్పటికే చీకటిపడడంతో మరుసటి రోజు ఉదయం ఎన్టీఆర్‌ఎఫ్ బృందాలు వచ్చి కాలువలో గాలింపు ప్రారంభించాయి. రెండు రోజుల పాటు అణువణువూ గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో చేసేది లేక గాలింపు నిలిపివేశారు. పోలీసుల విచారణలో కాలువలోకి దూకిన బాలికకు ఈత బాగా వచ్చని తేలింది. ఆమెను నగరానికి చెందిన ఓ రౌడీషీటరు ప్రలోభపెట్టి తీసుకెళ్లి ఉంటాడని అనుమానించారు. ఆచూకీ కోసం రెండు బృందాలను ఏర్పాటు చేశారు.
వెంటనే రౌడీషీటరు కదలికలపై నిఘా పెట్టారు. అతడి మిత్రులను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఎనిమిదేళ్ల క్రితమే చనిపోయారు. దీంతో అక్క, బావ వద్ద ఉంటోంది. ఘటన జరిగిన రోజు.. బాలిక కాలువలోకి దూకి, ఈతకొట్టుకుంటూ అవతలి ఒడ్డుకు చేరింది. అక్కడ రౌడీషీటరు ద్విచక్ర వాహనంతో సిద్ధంగా ఉన్నాడు. వీరు బైక్‌పై తన స్నేహితుడి ఇంటికి వెళ్లారు. అక్కడ దుస్తులు మార్చుకుని వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు.
ఆచూకీ కోసం ప్రయత్నాలు..అతడి వద్ద సెల్‌ఫోన్ కూడా లేకపోవడంతో ఆచూకీ పట్టుకోవడం కష్టంగా మారింది. రౌడీషీటర్ తల్లిని విచారించగా.. తనకు తెలియదని చెప్పింది. దీంతో ఆమె ఫోన్ కాల్స్‌పై నిఘా పెట్టడంతో నిందితుడి కదలికలు దొరికాయి. ఏలూరు జిల్లాలో తిరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితం అంతర్వేదిలోని ఓ మందుల షాపు నుంచి అతడి తల్లి ఫోన్‌కు కాల్ వచ్చింది. దీని ఆధారంగా పోలీసులు అక్కడికి వెళ్లి విచారించగా.. నిందితుడి తల్లి ఫోన్ నుంచి రూ. 1,500 తనకు పంపినట్లు, దానిని రౌడీషీటరుకు ఇచ్చినట్లు మందులషాపు యజమాని అంగీకరించాడు. బాలిక ప్రాణానికి హాని తలపెట్టే అవకాశం కూడా ఉందని పోలీసులు భావిస్తున్నారు.