Robbery: ఊరు వెళ్లడానికి వాహనం కోసం వేచిచూస్తున్న వ్యక్తిని బెదిరించి డబ్బులు లాక్కున్న ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. నిందితులను వారు వాడిన వాహనం రంగు ఆధారంగా పోలీసులు గుర్తించి అరెస్టు చేసినట్లు.. ఏడీసీపీ (క్రైమ్) గంగాధరం వెల్లడించారు.
ఈ నెల 22వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో కాలుష్య నియంత్రణ సంస్థలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజారావు.. శ్రీకాకుళం వెళ్లేందుకు ఆర్టీసీ కాంప్లెక్సుకు చేరుకోగా అప్పటికే బస్సులు వెళ్లిపోయాయి. దీంతో బయటకు వచ్చి ఫుట్‌పాత్‌పై నిలుచున్నారు. మూడు వాహనాలపై ఏడుగురు యువకులు అటుగా వచ్చి రాజారావు వద్ద ఆపారు. రూ.500 కావాలని డిమాండ్ చేశారు. దీంతో రాజారావు అక్కడ నుంచి వెళ్లిపోవటానికి ప్రయత్నించగా.. కత్తి చూపించి అతని జేబులో ఉన్న రూ.5,500 లాక్కుని అక్కడి నుంచి వాహనాలపై రైల్వేస్టేషన్‌పై వైపు వెళ్లిపోయారు. రాజారావు డయల్ 100కు సమాచారం ఇవ్వగా పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.