తెలంగాణ

telangana

ETV Bharat / crime

Robbery Murder: కదిరిలో దొంగల బీభత్సం.. ప్రభుత్వ ఉపాధ్యాయురాలి దారుణ హత్య - అనంతపురంలో దొంగల బీభత్సం

ఆంధ్రప్రదేశ్​లోని కదిరిలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికంగా ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణి (45) ఇంట్లో దొంగతనానికి వెళ్లిన దుండగులు ఆమెను దారుణంగా హతమార్చారు. అంతకుముందు ఆ పక్కింటిలోనూ చోరీ చేసే క్రమంలో ఆ ఇంట్లో ఉన్న శివమ్మ అనే మహిళను తీవ్రంగా గాయపరిచారు.శివమ్మ ఇంటి పనిమనిషి ఉదయం వచ్చి చూసే వరకు ఈ విషయం బయటకు రాలేదు.

Robbery Murder
కదిరిలో దొంగల బీభత్సం

By

Published : Nov 16, 2021, 12:45 PM IST

ఏపీ అనంతపురం జిల్లా కదిరిలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్లో చోరీకి పాల్పడి ఇద్దరు మహిళల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అనంతరం ఓ మహిళను హత్య చేశారు. మరో మహిళపై దాడి చేశారు. మృతురాలు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణి(45)గా గుర్తించారు. ఆమె భర్త శివశంకర్‌రెడ్డి. వీళ్లిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం శివశంకర్‌రెడ్డి ఉదయపు నడకకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఉషపై దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఆమె మెడలోని బంగారం లాక్కెళ్లారు.

అంతకుముందు వారి పక్కింట్లోకి ప్రవేశించిన దుండగులు.. శివమ్మ అనే మహిళపై దాడిచేసి, ఆమె మెడలోని బంగారాన్ని దోచుకున్నారు. తొలుత శివమ్మ కుమారుడు, కోడలిని గదిలో వేసి బంధించారు. ఈ దాడి ఘటనలో శివమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం ఇంట్లోకి వచ్చిన పనిమనిషి చూసి.. శివమ్మ కుమారుడు, కోడలు ఉన్న గది తలుపులు తెరిచింది.

బయటకు వచ్చిన వారు శివమ్మను బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఇళ్లలో ఒకేసారి చోరీ.. ఓ మహిళ హత్య గురించి తెలుసుకున్న స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details