Road Accidents in TS: రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై పోలీసుశాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే గత ఏడాది రోడ్డు ప్రమాదాలు, మరణాలు భారీగా పెరగడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణంలోనే ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. కారణాలను పరిశీలిస్తున్న అధికారులు మిగతా ప్రభుత్వ విభాగాలతో కలిసి నివారణ చర్యలపై అధ్యయనం చేస్తున్నారు. అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే గత ఏడాది రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగాయి. 2020లో 16,898, 2021లో 19,248 సంభవించాయి. ఇదే సమయంలో మరణాలు 6,033 నుంచి 6,690కి పెరిగాయి. అంటే ఏడాది కాలంలో ప్రమాదాలు 2,350, మరణాలు 657 పెరిగాయి.
రెండో స్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా
2018 నుంచి రోడ్డు ప్రమాదాలు తగ్గుతూ వస్తున్నాయి. గత ఏడాది నుంచి మళ్లీ పెరుగుదల నమోదయింది. లాక్‌డౌన్ కారణంగా 2020లో వాహనాల రాకపోకలు బాగా తగ్గాయి. ప్రమాదాలు తగ్గడానికి ఇదే కారణం. అయితే ఇదే సమయంలో ఎవరికివారు సొంత వాహనాలకు మొగ్గు చూపడంతో రాష్ట్రంలో వాహనాల రద్దీ బాగా పెరిగిపోయింది. దాని ప్రభావం మరుసటి ఏడాది పడింది. జిల్లాల వారీగా అధికారులు చేసిన అధ్యయనంలో జనవరి నుంచి నవంబరు వరకూ మొదటి 11 నెలల్లో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో మరణాలు, ప్రమాదాల్లో పెరుగుదల 49 శాతంగా నమోదయింది. ఇదే కాలానికి 2020లో ఇక్కడ 87 మంది మరణించగా 2021 నాటికి 130కి చేరింది. ప్రమాదాలు కూడా 80 నుంచి 119కి పెరిగాయి. మరణాల్లో 36 శాతం, ప్రమాదాల్లో 29 శాతం పెరుగుదలతో రాజన్నసిరిసిల్ల జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రమాదాలు 78 నుంచి 101కి, మరణాలు 78 నుంచి 106కు పెరిగాయి. ప్రమాదాల్లో 29 శాతం పెరుగుదలతో వరంగల్ కమిషనరేట్ మూడో స్థానంలో ఉంది. ఇక్కడ ప్రమాదాలు 302 నుంచి 391కి, మరణాలు 330 నుంచి 412కు పెరిగాయి. అత్యధికంగా సైబరాబాద్ కమిషరేట్‌లో 741 మంది మరణించారు. తర్వాతి స్థానంలో ఉన్న రాచకొండలో 564, వరంగల్ కమిషరేట్‌లో 412 మంది కన్నుమూశారు. సైబరాబాద్‌లో మరణాలు 12 శాతం పెరగ్గా రాచకొండలో 2 శాతం తగ్గాయి.