ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుంచి రాజమండ్రికి వెళ్తున్న కారు.. నెల్లూరు జిల్లా గూడూరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో.. నలుగురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది.
రెండు లారీల మధ్య కారు..
గూడూరు ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో జాతీయరహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. సింగిల్ రోడ్డు కావడం వల్ల తరచుగా అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. వేగ నియంత్రణకు స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయడంతో.. ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడం వల్ల కారు.. లారీని ఢీకొంది. అదే సమయంలో కారు వెనుకగా వచ్చిన మరో లారీ.. ఆ కారును బలంగా ఢీ కొట్టడంతో కారు.. రెండు లారీలు మధ్య నుజ్జు నుజ్జు అయింది.
మరో యువతికి గాయాలు
ఈ ప్రమాదంలో కారు లోపల ఇరుక్కుపోయిన వారిని బయటకు తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మృతులు వీరయ్య, వరలక్ష్మీ, మణికంఠ, స్వాతి తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. లిఖిత అనే మరో యువతికి తీవ్ర గాయాలతో ప్రస్తుతం నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.