తెలంగాణ

telangana

ETV Bharat / crime

పెళ్లికి బంగారం కొనేందుకు వెళ్తూ వధువు సహా ఆరుగురు మృతి - MAHABUBABAD accident news

ROAD ACCIDENT IN MAHABUBABAD 6 MEMBERS DIED
మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

By

Published : Jan 29, 2021, 12:12 PM IST

Updated : Jan 29, 2021, 5:53 PM IST

12:10 January 29

పెళ్లికి బంగారం కొనేందుకు వెళ్తూ వధువు సహా ఆరుగురు మృతి

10 రోజుల్లో వివాహం జరగాల్సిన ఇంట విషాదం నెలకొంది. కుమార్తె వివాహానికి నూతన వస్త్రాలు కొనేందుకు బయలుదేరిన ఆ కుటుంబం ఇంటికి తిరిగిరాలేదు. ఎన్నో ఆశలతో బిడ్డ పెళ్లి చేసేందుకు ఆరాటపడగా.. అంతలోనే కానరాని లోకాలకు వెళ్లిపోయారు. శుభలేఖలతో బంధువుల వద్దకు వెళ్లాల్సిన పెళ్లింటివారు.... విగతజీవులుగా మారారు. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు... పెళ్లిబాజాలతో మోగాల్సిన ఇంట్లో ఆర్తనాదాలను మిగిల్చింది.

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం... మర్రిమిట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతిచెందగా.. అందులో ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు ఐదుగురు ఉన్నారు. గూడురు మండలం ఎర్రకుంటతండాకు చెందిన జాటోత్‌ కళ్యా ణి-కస్నాలు ఫిబ్రవరి 10న కుమార్తె ప్రమీల వివాహం చేసేందుకు నిశ్చయించారు. శుభలేఖలు, పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైన కుటుంబం... నూతన వస్త్రాలు కొనుగోలు చేసేందుకు ఆటోలో వరంగల్‌కు బయలుదేరారు. వధువు ప్రమీలతో పాటు ఆమె తల్లి కళ్యాణి, బాబాయి ప్రసాద్, అన్న ప్రతీక్, చెల్లెలు దివ్య ఆటో డ్రైవర్‌ రాముతో కలిసి వరంగల్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో మర్రిమిట్ట శివారులోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న ఆటోను.... వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు కాగా... అందులో ప్రయాణిస్తున్న వారందరూ దుర్మరణం చెందారు.

ప్రొక్లెయినర్ సాయంతో..

 ప్రమాదం జరిగినతీరు.... అక్కడికి చేరుకున్న స్థానికులను కలచివేసింది. గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆటోలో ఇరుక్కుపోయిన ఆరుగురు మృతదేహాలను ప్రొక్లెయినర్ సాయంతో బయటికి తీశారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ పరారీ కాగా... నిందితుని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సీఎం దిగ్భ్రాంతి..

ప్రమాదం విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం... మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలిపారు. మంత్రులు సత్యవతిరాఠోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు..

Last Updated : Jan 29, 2021, 5:53 PM IST

ABOUT THE AUTHOR

...view details