Road Accident: కుటుంబసభ్యులతో వారంతా శివయ్య దర్శనం చేసుకున్నారు. దేవుని దర్శనం పూర్తికావడంతో ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యారు. తమ ఊరి సరిహద్దులోకి చేరుకున్నారు. కొన్ని నిమిషాల్లో వారింటి వద్ద దిగిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఇంతలో పెద్దశబ్దం వచ్చింది. దొర్లుకుంటూ రోడ్డు మీద పడ్డారు. ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితి.. నెత్తురోడుతూ హాహాకారాలు.. చిమ్మచీకట్లో రక్షించండి.. అని ఆర్తనాదాలు.. ఆదివారం అర్ధరాత్రి రెంటచింతల రహదారి ఈ భయానక సంఘటనకు సాక్షిగా నిలిచింది.
పల్నాడు ప్రమాదంలో ఏడుకి చేరిన మృతులు - రోడ్డు ప్రమాదం
23:54 May 29
ఆగి ఉన్న లారీని ఢీకొన్న మినీ వ్యాన్... ఏడుగురు మృతి
పల్నాడు జిల్లా రెంటచింతల బీసీ కాలనీకి చెందిన వారంతా సరకు రవాణా చేసే టాటా ఏస్ వాహనంలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. శ్రీశైలం నుంచి తిరిగొస్తున్న వీరి వాహనం రెంటచింతల పొలిమేరలోకి రాగానే స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. వాహనం పల్టీలు కొట్టడంతో ప్రయాణిస్తున్న వారంతా ఒకరిపై ఒకరు పడటంతో ఆర్తనాదాలు చేశారు.
చీకటే ప్రమాదానికి కారణం:మాచర్ల నుంచి రెంటచింతలకు ప్రవేశించే మొదట్లో గోలివాగు కాలువ ప్రవహిస్తుంది. ఇక్కడ స్నానాలు చేసేందుకు వాహనాలు ఆపుతుంటారు. ఇక్కడ అంతా చీకటిగా ఉండటంతో దగ్గరకు వచ్చే వరకు అక్కడ నిలిపి ఉన్న వాహనాలు కనిపించవు. దీంతో రహదారిపై ప్రయాణం చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ వ్యవసాయకూలీలు ప్రయాణిస్తున్న వాహన డ్రైవర్ నిత్యం తిరిగే రహదారి అన్న నిర్లక్ష్యంగా వేగంగా దూసుకెళ్లాడు.
రహదారిపై ఆగి ఉన్న ఉన్న లారీని గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలంలో నలుగురు చనిపోగా, తీవ్ర గాయాలైన మరో ముగ్గురు గురజాల ఆసుపత్రిలో చనిపోయారు. మృతులు కోటేశ్వరి(45), రోశమ్మ(65), రమాదేవి(50), కోటమ్మ(70), రమణ(50), లక్ష్మీనారాయణ(35)గా గుర్తించారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో వాహనంలో 38 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి:విషాదం నింపిన విహారం.. కర్ణాటకలో ముగ్గురు సూర్యాపేటవాసులు మృతి