తెలంగాణ

telangana

ETV Bharat / crime

లక్షలు పోయాయి, కొలువు పోయింది, చివరికి కన్నీరే కొలువైంది - హరీశ్​ ఆత్మహత్య

ఉద్యోగాలంటూ దళారుల చెప్పిన మాటలకు లక్షల రూపాయలు అప్పు తెచ్చి యువత కొలువుల్లో చేరారు. అది మూడ్నాళ్ల ముచ్చటగా మారింది. తరవాత ఉద్యోగాల నుంచి తొలగించడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరు జీతం పెరిగితే జీవితం బాగుంటుందని కలలు కన్నారు. కానీ ఇంతలోనే ఇలా అవ్వడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకీ ఏం అయ్యింది.

Ramagundam Fertilizer and Chemicals Limited
రామగుండం ఫెర్టిలైజర్​ అండ్​ కెమికల్స్​ లిమిటెడ్​

By

Published : Aug 28, 2022, 2:34 PM IST

Victims of RFCL: అంతా పేద, మధ్య తరగతి వారే. ఉద్యోగాలంటూ నమ్మించడంతో ఆశపడ్డారు. అందినకాడల్లా అప్పులు తెచ్చిమరీ దళారుల చేతుల్లో రూ.లక్షలు పోశారు. నాలుగు నెలలు తిరగకముందే ఉద్యోగం పోవడంతో ఇంటికి చేరారు. తాము ఇచ్చిన డబ్బు వెనక్కి ఇవ్వాలంటూ కొన్ని నెలలుగా మధ్యవర్తులు, నేతల చుట్టూ తిరిగారు. అదిగో..ఇదిగో అనే హామీలు తప్ప సొమ్ము వెనక్కి రాకపోవడంతో అరిగోస పడుతున్నారు.

రెండు రోజుల క్రితం ఓ బాధితుడు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా, మరుసటి రోజే ఆర్‌ఎఫ్‌సీఎల్‌ తొలగింపు కార్మికుడు ముంజ హరీశ్‌(28) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉద్యోగం కోసం ఖర్చుచేసిన సొమ్ములు నా చావుతోనైనా వస్తాయంటూ వాట్సప్‌ సందేశం పంపి శుక్రవారం అదృశ్యమైన హరీశ్‌ శనివారం పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ కుంట సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో శవమై తేలాడు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం అంబాల్‌పూర్‌కు చెందిన ఆయనకు 2015లో వివాహమైంది. భార్య రవళి, ఇద్దరు పిల్లలు నిహాల్‌(3), యువాన్‌(ఎనిమిది నెలలు)లు ఉన్నారు. కుటుంబ పెద్ద మరణంతో వారంతా దిక్కులేని వారయ్యారు. హరీశ్‌ మరణ నేపథ్యంలో కుటుంబ సభ్యులు, సహచర బాధితులు కరీంనగర్‌లో ధర్నా నిర్వహించారు.

5 నెలలుగా వివాదం.. ఏదీ పరిష్కారం..పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ కాంట్రాక్టు పొందిన గుత్తేదారు మార్చి నెలలో 250 మందిని ఉద్యోగాల నుంచి తొలగించడంతో వివాదం మొదలైంది. అప్పుడే బాధితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. బాధిత కార్మికులతో అప్పట్లో ఎమ్మెల్యే చందర్‌ మాట్లాడి శాంతింపజేశారు. అందరికీ న్యాయం చేస్తానని, బాధితులంతా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ గేటు ముందుకు రావాలంటూ ఇటీవల బాధితులకు పిలుపునిచ్చారు. ఈ వ్యవహారంపై ఈ నెల 4న అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకున్నారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో పోలీసులు ఎక్కడికక్కడే నాయకులను గృహ నిర్బంధం చేశారు. దీంతో బాధితుల సమస్యకు పరిష్కారం ప్రశ్నార్థకమైంది. మరోవైపు తొలగింపునకు గురైన కార్మికులతో ఇటీవల కొంత మంది దళారులు రాజీకి వచ్చారు. డబ్బుకు హామీగా రుణపత్రాలు, భూమి పత్రాలు రాసిచ్చారు. 20 రోజులైనా ఆ హామీ నెరవేరలేదు. డబ్బులు చేతికి అందలేదు. మరోవైపు డబ్బు కోసం వెళ్లిన బాధితులకు దళారుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. దీంతో వారంతా మానసికంగా కుంగిపోతున్నారు. ఉన్న ఉద్యోగం పోవడం, తెచ్చిన సొమ్ముకు వడ్డీలు కట్టే మార్గం లేకపోవడంతో ప్రాణాలు తీసుకునేందుకూ సిద్ధపడుతున్నారని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

అందరికీ న్యాయం చేస్తాం..ఎమ్మెల్యే చందర్‌ పిలుపుమేరకు 130 మంది బాధితులు గోదావరిఖనిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. దళారులు ఎవరెవరు? ఎంత తీసుకున్నారనే వివరాలు ఎమ్మెల్యేకు వివరించారు. అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చి, ఎవరూ తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఎమ్మెల్యే విన్నవించారు.

నిందితులను అరెస్ట్​ చేసిన పోలీసులు..ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడ్డ నిందితులు చెలకలపల్లి సతీష్‌, గుండు రాజు, గోపగాని మోహన్‌గౌడ్‌, బొమ్మగాని తిరుపతిగౌడ్‌లను శనివారం అరెస్టు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రూపేష్‌ తెలిపారు.

"మూతపడిన ఎఫ్‌సీఐ పునరుద్ధరణలో భాగంగా రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభమైంది. ఎరువుల బస్తాల లోడింగ్‌, అన్‌లోడింగ్‌ పనుల కోసం 2020 నవంబరులో ఆన్‌లైన్‌లో టెండరు పిలిచారు. ఎస్‌వీఎల్‌ కంపెనీ పేరుతో మోహన్‌గౌడ్‌, గుండు రాజు టెండరు వేయగా తిరస్కరణకు గురైంది. ఫైవ్‌స్టార్‌ కంపెనీకి ఖరారైంది. దీనిపై వారివురూ హైకోర్టును ఆశ్రయించగా స్టే వచ్చింది. అనంతరం ఫైవ్‌స్టార్‌ కంపెనీతో రాజీ కుదుర్చుకున్న మోహన్‌గౌడ్‌, రాజు రూ.2 కోట్లు గుడ్‌విల్‌ కింద ముట్టజెప్పి సబ్‌ కాంట్రాక్టు తీసుకున్నాడు. ఉద్యోగాల పేరుతో వసూళ్లు మొదలుపెట్టారు. ఉద్యోగంతోపాటు నివాసం, వైద్య సదుపాయాలు కల్పిస్తారని, ప్రతినెలా జీతం పెరుగుతుందని నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ వసూలు చేశారు. తమ సన్నిహితులైన చెలకలపల్లి సతీష్‌, బొమ్మగాని తిరుపతిగౌడ్‌ల ద్వారానూ డబ్బులు దండారు. మొత్తం 650 ఉద్యోగాలకుగానూ 300 మంది వద్ద సుమారు రూ.14 కోట్ల వరకు వసూలు చేశారు. 2021, డిసెంబరులో లోడింగ్‌, అన్‌లోడింగ్‌ టెండరు మరో కంపెనీకి ఖరారు కావడం, కొత్తగా వచ్చిన గుత్తేదారు 200 మంది గేటు పాసులు రద్దు చేయడం, వారంతా ఆందోళనకు దిగడంతో వసూళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముంజ హరీశ్‌ ఏడాది క్రితం రూ.7 లక్షలు చెల్లించి ఉద్యోగంలో చేరాడు. ఐదు నెలల క్రితం అతన్ని తొలగించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరిన వారి నుంచి స్పందన లేకపోవడతో మనస్తాపంతో శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు". - పెద్దపల్లి డీసీపీ రూపేష్‌

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details