తెలంగాణ

telangana

ETV Bharat / crime

హైదరాబాద్ పాతబస్తీలో పగలు, ప్రతీకారాలు

హైదరాబాద్ పాతబస్తీలో పగలు, ప్రతీకారాలతో హత్యలు జరుగుతున్నాయి. ప్రత్యర్థిని మాటు వేసి మరీ దాడి చేసి హతమార్చుతున్నారు. మృతి చెందారని నిర్థారించుకునే వరకు ఆయుధాలతో దాడి చేయడం పోలీసులను సైతం నివ్వెరపరుస్తోంది. కొందరైతే నేర చరిత్ర లేకున్నా.. కేవలం ప్రతీకారం తీర్చుకోవడానికి ఉన్మాదుల్లా మారుతున్నారు. ఎక్కువశాతం హత్యలు ఆర్థిక లావాదేవీలు, ప్రతీకారేచ్ఛతోనే జరుగుతున్నాయి.

By

Published : Apr 2, 2021, 9:58 PM IST

revenge murders
ప్రతీకారేచ్ఛతో ఉన్మాదుల్లా మారుతున్నారు..

ప్రతీకారేచ్ఛతో ఉన్మాదుల్లా మారుతున్నారు..

మైలార్​దేవ్ పల్లిలోని వట్టేపల్లి సమీపంలో అసద్ అనే రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. మూడేళ్ల క్రితం అసద్ అంజాద్ ఖాన్ అనే వ్యక్తిని సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్... జైలుకు వెళ్లొచ్చాడు. అంజాద్ ఖాన్ హత్యకు ప్రతీకారంగానే ఆయన కుటుంబ సభ్యులు అసద్‌ను హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అసద్‌ను ఆటోతో ఢీకొట్టి ఒక్కసారిగా వేట కొడవళ్లతో దాడి చేసిన ఆరుగురు నిందితులు... మృతుడి తల ఛిద్రమయ్యే వరకు దాడి చేశారు. మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళ్లిపోయారు. గత నెలలో లంగర్​హౌజ్​లోనూ దారుణ హత్య చోటుచేసుకుంది. సొంత అన్నను తమ్ముడు కట్టెతో తలపై మోది ప్రాణం పోయేంతవరకు నడిరోడ్డుపైనే కొట్టి చంపాడు. చిక్కడ్ పల్లి ఠాణా పరిధిలోనూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహణలో తేడాలొచ్చి వ్యాపార భాగస్వామిని గొంతు కోసి హత్య చేశాడు. పాతబస్తీలోని మరో రెండు ఘటనల్లో రౌడీ షీటర్లు మృతి చెందారు.

కిరాతకంగా..

జనవరి 11న రాత్రి సమయంలో రాజేంద్రనగర్ పిల్లర్ నెంబర్ 248 వద్ద దారుణ హత్య జరిగింది. మహ్మద్ ఖలీల్ అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు తలపై రాళ్లతో కొట్టి చంపారు. తీవ్ర రక్తస్రావమైన ఖలీల్ ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. ఖలీల్ వద్ద వడ్డీకి డబ్బులు తీసుకున్న వ్యక్తులే హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జనవరి 10న ఉదయం రాజేంద్రనగర్​లోని పిల్లర్ నెంబర్ 223 వద్ద సూట్ కేసులో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. మృతుడు ఆటో డ్రైవర్ రియాజ్‌గా తేల్చారు. డబ్బుల వ్యవహారంలో తలెత్తిన గొడవలతోనే తోటి స్నేహితులు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. దుండిగల్ ఠాణా పరిధిలో జనవరి 27న పేకాటలో డబ్బులు కోల్పోయిన ముగ్గురు యువకులు.. ఓ వ్యక్తిని రాయితో కొట్టి దారుణంగా హత్యచేశారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఏడాదిన్నర బాబును చంపాడో కర్కోటకుడు. సరూర్ నగర్ ఠాణా పరిధిలోని కోదండరామ్ నగర్​కు చెందిన రాజు భర్తతో గొడవపడి వేరుగా ఉంటున్న మౌనిక అనే వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఏడాదిన్నర బాబు ఏడుస్తుండటం తట్టుకోలేక కోపంతో రాజు బాబును గట్టిగా కొట్టగా రక్తం కక్కుకుని మృతి చెందాడు.

సమాచారమివ్వండి..

శాంతి భద్రతల పర్యవేక్షణకు అహర్నిశలు పనిచేస్తున్న పోలీసులు ప్రాణహాని ఉందని తెలిస్తే ముందే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: సునీల్ నాయక్​ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం: బండి సంజయ్​

ABOUT THE AUTHOR

...view details