ఈ నెల 19న హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను ఓ ప్రధాన కొరియర్ సర్వీసు ద్వారా విశాఖలోని స్నేహితుడికి పంపారు. హైదరాబాద్‌లో ఓ కొవిడ్ బాధితుడి కోసం వాటిని కొనుగోలు చేయగా అతను మృతి చెందడంతో... మిగిలిపోయిన వాటిని అమ్మకానికి పెట్టారు. ఇందు కోసం విశాఖలోని తన స్నేహితులను వాట్సప్‌లో సంప్రదించారు. ఈ వాట్సప్ సందేశాలు ఔషధ నియంత్రణశాఖ డీజీ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే విశాఖలోని అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రోగి బంధువుల మాదిరి ఇంజక్షన్లు కావాలని ఫోన్ చేయగా అయిదు వయల్స్ ధర రూ.1.35 లక్షలుగా పేర్కొన్నారు. తరువాత అధికారులు వలపన్ని వారిని పట్టుకోవడంతో ఎట్టకేలకు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అవి హైదరాబాద్ నుంచి ఎలా వచ్చాయి, ఏ కొరియర్ నుంచి ఎవరి ద్వారా వచ్చాయి వంటి అంశాలను ఆరా తీశారు.
ఈ నెల 12న కలెక్టరేట్‌కు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొవిడ్‌తో బాధపడుతున్న వ్యక్తికి ఆక్సిజన్ అందక శ్వాస ఇబ్బందిగా మారడంతో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అవసరమన్నారు. నగరంలో ఒకటి, రెండు చోట్ల సంప్రదించగా ఒక్కో వయల్ రూ.35 వేలు అవుతుందన్నారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని తెలిసిన బంధువులను సంప్రదించగా అక్కడ ఒక్కో వయల్ రూ.25 వేలకు దొరకడంతో ఆరు వయల్స్‌ను హైదరాబాద్ నుంచి పార్సిల్ రూపంలో తెప్పించుకున్నారు.
*అధిక సంఖ్యలో ఆసుపత్రులు కొవిడ్ చికిత్స అందిస్తుండటంతో విశాఖలోని వ్యక్తులతో హైదరాబాద్ నుంచి కొందరు సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా విశాఖలో కొవిడ్ చికిత్సకు అనుమతి తీసుకోకుండా వైద్యం చేస్తున్న కొన్ని ఆసుపత్రుల నిర్వాహకులు వీరి ద్వారా తెప్పించుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ఆసుపత్రి నిర్వాహకులే బాధితులకు ఇచ్చే ఇంజక్షన్ల నిమిత్తం ఒక్కో వయల్‌కు రూ.30 నుంచి రూ.35 వేలు వసూలు చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి కొంత తక్కువకు తెప్పించుకొని విశాఖలోని బాధితులకు కొంత అదనపు ధరతో అమ్ముతున్నట్లు తెలుస్తోంది.
కొరియర్లో తెప్పిస్తున్నారు:కొందరు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను నగరానికి ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఇటీవల వలపన్ని కొందరి నుంచి ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నాం. వాళ్లకు ఎలా వచ్చాయనేది నిందితులను ఆరా తీస్తే ...హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా వచ్చినట్లు తెలిపారు. దీనికి సంబంధించి ఔషధ నియంత్రణశాఖ డీజీకి వచ్చిన సమాచారం మేరకు దీన్ని పట్టుకున్నాం. అక్రమంగా తీసుకొస్తున్న వాటిపైనా దృష్టిసారిస్తున్నాం. రెమ్‌డెసివిర్, ఇతర ఇంజక్షన్లపైనా ప్రత్యేక నిఘా ఉంచాం.