ఒకప్పుడు దొంగలు ఇళ్లకు కన్నాలేసి.. బీరువాలు పగలగొట్టి, అయినకాడికి ఎత్తుకెళ్లేవారు. ఇప్పుడు ఉన్నచోటి నుంచే ఆన్‌లైన్ ద్వారా సొత్తు దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు (Cybercriminals). మనతోనే తాళాలు (పాస్‌వర్డ్‌లు) ఇప్పించుకుని, మనం కళ్లు తెరిచి చూసేలోగా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఫోన్ చేసి నాలుగు మాయమాటలు చెప్పి, డెబిట్‌కార్డుకు ఉండే నాలుగంకెల పిన్ నెంబరు తెలుసుకుని.. గుల్ల చేస్తున్నారు. మనం డౌన్‌లోడ్ చేసుకునే సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌ల ద్వారా మన రహస్యాల గుట్టు పట్టేస్తున్నారు. ఏదైనా సమాచారం కోసం కంప్యూటర్‌లో వెబ్‌సైట్లు వెతుకుతుంటే.. మధ్యలో చొరబడి ‘మాల్‌వేర్’ వలలు విసిరి మన సమాచారాన్ని తస్కరిస్తున్నారు. ఒక్కసారి మన సమాచారం మోసగాళ్ల చేతికి చిక్కిందా.. కష్టపడి సంపాదించిన సొమ్మంతా పోయినట్లే. ఈ తరహా మోసాలపై భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ)కు, ఆర్‌బీఐ నియమించిన బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ కార్యాలయాలకు భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆర్‌బీఐ అంబుడ్స్‌మ్యాన్ కార్యాలయం డిజిటల్ మోసాల తీరుతెన్నులపై సమగ్ర నివేదికను రూపొందించింది. ఎవరికి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ నివేదిక సూచించింది.
ఇలా మోసపోతాం..
ఆన్‌లైన్లో బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తుంటే, సైబర్ మాయగాళ్లకు చిక్కే ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. అత్యధిక శాతం సైబర్ మోసాలు ఇక్కడే జరుగుతాయి.
డౌన్‌లోడ్లు, మొబైల్ యాప్‌ల ద్వారా
మొబైల్ ఫోన్, ల్యాప్‌ట్యాప్, డెస్క్‌టాప్‌లపై నిర్ధారణ కాని సాఫ్ట్‌వేర్‌లు, యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. ఇటువంటి అప్లికేషన్లను సాధారణంగా ఎస్‌ఎంఎస్/ సోషల్ మీడియా/ ఇన్‌స్టెంట్ మెసెంజర్ ద్వారా షేర్ చేస్తుంటారు. అందువల్ల వీటిని పూర్తిగా నమ్మలేం. సైబర్ నేరస్తులు యాప్స్ ముసుగులో మన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంటుంది. ఒకసారి దాన్ని మనం డౌన్‌లోడ్ చేసుకుంటే మన కంప్యూటర్/ సెల్‌ఫోన్ వాళ్ల అధీనంలోకి వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.
స్క్రీన్ షేరింగ్ యాప్/ రిమోట్ యాక్సెస్
స్క్రీన్ షేరింగ్ యాప్‌లను మనం డౌన్‌లోడ్ చేసుకునేలా మాయగాళ్లు వల విసురుతారు. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోగానే మనం సిస్టమ్/ మొబైల్ ఫోన్ వాళ్ల అజమాయిషీలోకి వెళ్లిపోతుంది. దాంతో మన బ్యాంకు ఖాతా నుంచి సులువుగా సొమ్ము లాగేస్తారు.
సిమ్ స్వాప్/ క్లోనింగ్
చాలా వరకు డిజిటల్ లావాదేవీల్లో సెల్‌ఫోన్ నంబరే కీలకం. అందువల్ల మోసగాళ్లు మన సెల్‌ఫోన్ సిమ్ కార్డును క్లోనింగ్ చేసేందుకు లేక డూప్లికేట్ సిమ్ కార్డు సంపాదించేందుకు ప్రయత్నిస్తారు, ఆ ప్రయత్నంలో వారు విజయం సాధిస్తే మనకు కోలుకోని నష్టం జరిగినట్లే. ఇటువంటి మోసగాళ్లు మనకు ఫోన్ చేసి, సిమ్ కార్డును అప్‌గ్రేడ్ చేయడానికి, లేదా మరొక అవసరం ఉందని చెబుతూ పూర్తి వివరాలు తెలుసుకుంటారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా మోసాలు
మోసగాళ్లు మనకు ఫోన్ చేసి ఒక క్యూ ఆర్ కోడ్ పంపుతామని, దాన్ని స్కాన్ చేస్తే మీకు ఫలానా ప్రయోజనం లభిస్తుందని చెబుతారు. తొందరపడి దాన్ని స్కాన్ చేస్తే నష్టపోతాం.
మీ స్నేహితుడి నకిలీ ఖాతాతో
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో మీకు తెలిసిన వారి పేరుతో నకిలీ ఖాతాలను సృష్టిస్తారు. మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. ఆ తర్వాత అత్యవసరం అంటూ ఆ ఖాతా నుంచి డబ్బు అడుగుతారు. స్నేహితుడే కదా అని మీరు పంపిస్తారు. ఒక్కోసారి ప్రైవేట్ చాట్‌చేసి దాని ఆధారంగా బ్లాక్ మెయిల్‌కూ పాల్పడతారు.
జ్యూస్ జాకింగ్ ద్వారా
మొబైల్ ఛార్జింగ్ పోర్టు కూడా ఫైల్స్/డేటా బదిలీకి ఉపయోగించే అవకాశం ఉంది. దీన్నే జ్యూస్ జాకింగ్ అంటారు. మీకు తెలియని ప్రదేశాల్లోని ఛార్జింగ్ పోర్టుల్లో మొబైల్ పెట్టినా, తెలియని యాప్‌లను మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నా.. మీ ఆర్థిక సమాచారం, వ్యక్తిగత సమాచారం తస్కరించే ప్రమాదముంది. ఆ తర్వాత మనల్ని మోసం చేయడం చాలా సులువు.
లాటరీ వచ్చిందంటారు
మనకు ఫోన్ వస్తుంది. భారీ మొత్తంలో లాటరీ తగిలందంటారు. ఆ డబ్బు దక్కాలంటే, నగదు బదిలీ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజు కింద కొంత మొత్తం కట్టాలంటారు. లాటరీతో పోలిస్తే అడిగే మొత్తం చాలా చిన్నదే కదా అని మనం కడతాం. అంతే ఇక అవతలి ఫోన్ పనిచేయదు.
ఉద్యోగమిస్తామంటారు
నకిలీ ఉద్యోగ పోర్టల్‌ను సృష్టిస్తారు. రిజిస్ట్రేషన్ నిమిత్తం బ్యాంకు ఖాతా/క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు వివరాలు అడుగుతారు. కొన్ని కేసుల్లో కంపెనీ అధికార్లుగా మోసగాళ్లు నకిలీ ఇంటర్వ్యూలూ చేస్తారు. శిక్షణ కోసం కొంత డబ్బు అడుగుతారు. ఇవన్నీ నమ్మామో అంతే.