అడ్డా నుంచి మహిళా కూలీని తీసుకెళ్లిన కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు అంతమొందించే ప్రయత్నం చేశారు. స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. ఈ దారుణం శంషాబాద్ మండల పరిధిలో బుధవారం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. మదనపల్లి కొత్త తండాకు చెందిన ఓ మహిళ(40) దినసరి కూలీ. రోజులాగానే బుధవారం ఉదయం శంషాబాద్‌లోని అడ్డా దగ్గర నిలబడింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పని ఉందంటూ ఆమెను పిలిచారు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని కవ్వగూడ వ్యవసాయ పొలాల్లోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తర్వాత బండరాయితో తలపై మోది పరారయ్యారు. రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని స్థానిక రైతులు గమనించి 100కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృత్యువాత పడిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త ఎనిమిదేళ్ల క్రితం మరణించారు. ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడిని బాధితురాలు తన రెక్కల కష్టంతో పోషిస్తోంది. చిన్న కుమార్తెకు మూడు నెలల క్రితం వివాహం చేసింది. కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు.