rape accused arrest : బాలికతో వ్యభిచారం చేయించిన కేసులో మరో ఐదుగురిని గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో వైకాపాకు చెందిన ఓ మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు కన్నా భూశంకరరావు ఉన్నాడు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా బారిన పడటంతో ఆ బాలికతో పాటు ఆమె తల్లి గతేడాది జూన్‌లో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరారు. అనంతరం చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. అప్పటి నుంచి ఆ బాలిక బాగోగులు తండ్రి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో పరిచయమైన ఓ మహిళ కరోనా పూర్తిగా నయమయ్యేందుకు నాటు వైద్యం చేయిస్తానని ఆ బాలిక తండ్రికి మాయమాటలు చెప్పి నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మిన తండ్రి తన కుమార్తెను ఆ మహిళ వెంట పంపారు. కరోనా తగ్గిపోయాక సదరు మహిళ ఆ బాలికను వ్యభిచారంలోకి దింపింది.
Girl Prostitution in Guntur : గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, కాకినాడ తదితర ప్రాంతాలకు తీసుకువెళ్లి వ్యభిచారం చేయించింది. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి తప్పించుకున్న బాలిక పేరేచర్లలో ఉంటున్న తన తండ్రి వద్దకు చేరుకుని మేడికొండూరు ఠాణాలో ఫిర్యాదు చేసింది. అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు అరండల్‌పేటకు కేసు బదిలీ చేశారు. బాలికను పోలీసులు విచారించడంతో ఈ రాకెట్లో మొత్తం 45 మందికి పైగా ఉన్నట్లు తేలింది. అలాగే రిమాండ్ రిపోర్టులో కొందరి పేర్లే ఉన్నాయని, అందరి పేర్లు లేవని ఆ బాలిక న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. దీంతో వ్యభిచార నిర్వాహకులు, విటులను కూడా అరెస్టు చేయాలని జడ్జి ఆదేశించారు. ఇందులో భాగంగా నిజాంపట్నంకు చెందిన భూ శంకరరావు, వ్యభిచారం నిర్వహిస్తున్నందుకు కాకినాడకు చెందిన సింహాచలం, విటులు క్రాంతికుమార్, శివరామకృష్ణ, నాగిరెడ్డి శివను అరండల్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 36 మందిని అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.