జీపీఏ రద్దు, భూమి రిజిస్ట్రేషన్ విషయంలో ఐదున్నర లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి.. స్వీకరిస్తున్న రాజేంద్రనగర్ సబ్‌రిజిస్ట్రార్ హర్షద్ అలీ అనిశా అధికారులకు అడ్డంగా చిక్కాడు. లంచం స్వీకరించే విషయంలో అతడికి సహకరించిన డాక్యుమెంట్ రైటర్ వాసును కూడా అధికారులు పట్టుకున్నారు. అయితే... ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్‌ను పట్టుకున్న సమయంలో హర్షద్ అలీ తన వద్ద ఉన్న ఫోన్‌ను కన్పించకుండా చేశాడు. అధికారులు ఎంత అడిగినా.. ఫోన్ తన దగ్గర లేదంటూ... సమాధానమిచ్చాడు. ఫోన్లో కీలక సమాచారం ఏదైనా ఉండవచ్చని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు.
హర్షద్ అలీ ప్రత్యేకంగా లంచాలు వసూలు చేసేందుకు ఐదుగురు వ్యక్తులను నియమించుకున్నట్లు అనిశా గుర్తించింది. అతడు నియమించుకున్న వ్యక్తులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చేవారి దగ్గర నుంచి లంచాలు డిమాండ్ చేసి.. హర్షద్ అలీకి సమర్పిస్తున్నట్లు అనిశా అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ నెలలోనే ఇప్పటి వరకు హర్షద్ అలీ లంచాల రూపంలో రూ. 50 లక్షలకు పైగా దండుకున్నట్లు ఏసీబీ భావిస్తుంది. ప్రతిరోజూ రెండు లక్షల రూపాయలు వసూలు చేయాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది.