మహిళలు, యువతులను వేధించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే రంగంలోకి దిగి పోకిరీలను అదుపులోకి తీసుకుంటున్నారు. గత రెండు నెలల కాలంలో రాచకొండ కమిషనరేట్‌లో 53 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. బాల్య వివాహాలను తీవ్రంగా పరిగణిస్తూ వాటిని అడ్డుకుంటున్నారు. పోకిరీలు ఏ స్థాయిలో ఉన్నా.. వారిని అరెస్టు చేసి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వారి వైఖరిలో మార్పు రాకపోతే జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు.
- మేడిపల్లి ప్రాంతంలో నివసించే ప్రభుత్వ ఉద్యోగిని శౌచాలయంలో ఉండగా ఓ వ్యక్తి ఆమెను గమనిస్తున్నట్లు కనుగొంది. తన భర్త సహాయంతో అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించింది. అతను వెంకటాపూర్ గ్రామానికి చెందిన శ్రవణ్‌కుమార్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.
- వనస్థలిపురానికి చెందిన మహిళను ఆమె మామ వేధించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
- కీసరగుట్ట, మల్కాజిగిరి, చౌటుప్పల్ తదితర ప్రాంతాల్లో డెకాయి ఆపరేషన్లు కూడా షీ బృందాల పోలీసులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కుషాయిగూడ, భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, ఎల్‌బీ నగర్ ప్రాంతాల్లో మొత్తం 11 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. షీ బృందాల పనితీరును పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు.