తెలంగాణ

telangana

ETV Bharat / crime

డ్రైవర్​ను బెదిరిస్తారు.. టైర్ల లోడు కంటైనర్లను దారి మళ్లిస్తారు... ​ - lorry tyres theft gang

Lorry Tyres Theft Gang Arrested: టైర్ల లోడు కంటైనర్లను దారి మళ్లించి రూ. లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. డ్రైవర్​ను తుపాకితో బెదిరించి లారీ టైర్లను వారికి సంబంధించిన గోదాములకు తరలించి విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ఒకే తరహా దోపిడీకి పాల్పడినట్లు రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ వెల్లడించారు. నిందితుల నుంచి 152 టైర్లను స్వాధీనం చేసుకున్నారు.

లారీ టైర్ల దోపిడీ ముఠా అరెస్ట్​

By

Published : Feb 22, 2022, 5:17 PM IST

Updated : Feb 22, 2022, 5:54 PM IST

Lorry Tyres Theft Gang Arrested: తుపాకితో బెదిరించి దారి దోపిడీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్​ ఎల్బీనగర్ సీసీఎస్, పహాడీషరీఫ్‌ పోలీసులు పట్టుకున్నారు. కేసు వివరాలను రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ మీడియా సమావేశంలో వెల్లడించారు. హరియాణాకు చెందిన ఈ దోపిడీ దొంగలకు కరుడుగట్టిన ముఠాగా పేరుంది. హరియాణా మేవట్‌ జిల్లా ఫేరోజ్‌పూర్‌ తానాకు చెందిన ప్రధాన నిందితుడు జంషెడ్‌ ఖాన్, హైదరాబాద్ యాకుత్‌పురాకు చెందిన ఆఫ్రోజ్‌ అలీ ఖాన్​, సయ్యద్​ హుస్సేన్‌ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు లారీ టైర్ల లోడుతో వెళ్లే కంటైనర్లను లక్ష్యంగా చేసుకుని డ్రైవర్లకు తుపాకులు చూపి బెదిరించి.. టైర్లను దొంగలిస్తున్నారు. ఇటీవల పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ముఠా.. తమిళనాడుకు చెందిన కంటైనర్‌ డ్రైవర్‌ను తుపాకితో బెదిరించి 192 లారీ టైర్లను దోచుకుంది. అనంతరం లారీని వదిలేసి దోపిడీ దొంగలు పరారయ్యారు.

సీసీ కెమెరాల సాయంతో

డ్రైవర్​ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు.. మూడు రోజుల పాటు శ్రమించి నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జంషెడ్‌ఖాన్‌ను దిల్లీ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 8 ఎంఎం తుపాకికి చెందిన తూటాను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా ముఠాలోని ఇతర సభ్యుల వివరాలు బయటపడటంతో వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో లారీ టైర్లు తక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యాపారి కమల్‌ కాబ్రా కూడా ఉన్నాడు. ముఠా సభ్యులను పోలీసు కస్టడీకి తీసుకుని విచారించనున్నట్లు సీపీ మహేశ్​ భగవత్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి 152 లారీ టైర్లు, రూ. 20 వేల నగదు, కారు, ద్విచక్ర వాహనం, 4 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

"లారీ టైర్ల దోపిడీలో జంషెడ్​ ఖాన్​ ప్రధాన నిందితుడు. జంషెడ్​ ఖాన్​, హైదరాబాద్​ బేగంబజార్​లో టైర్ల బిజినెస్​ చేస్తున్న కమల్​ కాబ్రా, నగరానికి చెందిన మరో ఇద్దరు ముఠాగా ఏర్పడ్డారు. ఈ నెల 17న తెల్లవారుజామున నల్గొండ జిల్లాలో రహదారిపై వెళ్తున్న టైర్ల లోడు కంటైనర్​ను ఆపి.. తుపాకులతో బెదిరించి ఆ వాహనాన్ని తిప్పర్తి వద్ద దారి మళ్లించారు. కాటేదాన్​ గోదాముకు మళ్లించిన తర్వాత.. వాహనంలోని 192 టైర్లను కమల్​ కాబ్రా తక్కువ ధరకు కొనుగోలు చేశాడు. అనంతరం వాటిని బయట విక్రయిస్తాడు. మార్కెట్​లో ఒక్కో టైరు విలువ రూ. 25 వేల పైనే ఉంటుంది. అనంతరం లారీని డ్రైవర్​తో సహా రోడ్డుపై వదిలేశారు. డ్రైవర్​ ఫిర్యాదుతో మూడు రోజుల పాటు సీసీ కెమెరాలు, సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టాం. ఎట్టకేలకు జంషెడ్​ ఖాన్​ను దిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశాం. వారి నుంచి 152 టైర్లు స్వాధీనం చేసుకున్నాం. ఇదే తరహా దోపిడీ.. గత నెల 18న జంషెడ్​ ఖాన్​ ఆధ్వర్యంలోనే జరిగింది. -మహేశ్​ భగవత్​, రాచకొండ సీపీ

ఇదీ చదవండి:డిగ్రీ ఏదైనా ‘లక్ష’ణంగా పట్టా.. నకిలీ ధ్రువపత్రాల గుట్టురట్టు

Last Updated : Feb 22, 2022, 5:54 PM IST

ABOUT THE AUTHOR

...view details