Theft in Temples gang arrested: దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 19 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది డిసెంబరు 3న ఎల్బీ నగర్లోని సంతోషిమాత ఆలయంలో చోరీ జరిగిందన్న ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నామని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. ఆలయంలో చోరీకి గురైన సొమ్ము దొరికిందని సీపీ పేర్కొన్నారు. నిందితులకు పెద్ద నేర చరిత్ర ఉందని వెల్లడించారు. నలుగురికి అదుపులోకి తీసుకున్నామని.. ముఠాలోని మరొకరు పరారీలో ఉన్నారని వివరించారు.
"ఈ ముఠా సభ్యులు ఇప్పటివరకూ పది దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. అందులో 4 గుళ్ల దొంగతనాలు, ఒకటి బ్యాంకు చోరీ, మిగతావి ఇళ్లు, ఆటోమొబైల్ సామాన్ల దోపిడీలకు పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు సత్యానంద్ అలియాస్ సతీశ్ పైన పలు పోలీసుస్టేషన్లలో 30 కేసులు నమోదయ్యాయి. ఈ ముఠా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ చోరీలకు పాల్పడింది. గతేడాది డిసెంబరు 3 న ఎల్బీనగర్ సంతోషిమాత ఆలయంలో చోరీ జరిగినట్లు ఫిర్యాదు మేరకు దర్యాప్తులో నిందితులను పట్టుకున్నాం." --- మహేశ్ భగవత్, రాచకొండ సీపీ