Cyber Criminal Arrest: సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరగాడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళను బురిడీ కొట్టించి ఆమె నుంచి 28 లక్షల 86 వేల రూపాయలు నేరగాడు కొల్లగొట్టినట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. బిహార్ రాష్ట్రం నవాడ జిల్లాకు చెందిన రాజేష్ కుమార్.. సికింద్రాబాద్ తిరుమలగిరి ప్రాంతానికి చెందిన వెంకాయమ్మను మోసం చేసి డబ్బులు దండుకున్నాడు. ఇటీవల వెంకాయమ్మ ఆన్‌లైన్ ఇ-కామర్స్... షాప్ క్లూస్ ద్వారా ఆడియో ఇయర్ ఫోన్‌లను ఆర్డర్ చేసింది. ఆ తర్వాత ఆమెకు వివిధ ఫోన్ నెంబర్ల నుంచి ఫోన్లు రావడం మొదలైంది.
లాటరీని వచ్చిందని..
షాప్ క్లూస్ నుంచి మాట్లాడుతున్నానని తన పేరు అశోక్ అని వెంకాయమ్మకు చెప్పి ఆమెకు 15 లక్షల విలువైన కారు లాటరీలో వచ్చిందని తెలిపాడు. కారు కావాలా లేక డబ్బులు కావాలా అని అడిగాడు. ఇందుకు ఆమె డబ్బులే కావాలని చెప్పింది. ముందుగా 8500 రూపాయలు చెల్లిస్తే.. డబ్బులు వస్తాయంటూ సదరు నేరగాడు బుకాయించాడు. అతను సూచించిన బ్యాంకు ఖాతాకు ఆమె డబ్బులు జమ చేసింది. ఈ విధంగా ప్రాసెసింగ్, రిజిస్ట్రేషన్ ఇతర ఛార్జీల పేరిట డబ్బులు జమ చేయాలంటూ పలు మార్లు రూ. 28 లక్షల 86 వేల రూపాయలు నేరగాడి ఖాతాలకు బదిలీ చేసింది.