శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా 'రాజరాజచోర'. అయితే ఈ సినిమా గురించి మాకేందుకు అనుకుంటున్నారా..? అచ్చం ఆ సినిమాలో మాదిరిగానే.. మన చోరశిఖామణి కూడా దొంగతనాలు చేస్తూ.. ఓ సామ్రాజ్యాన్నే సృష్టించాడు. ఆ స్టోరీతో తీసిన సినిమాకు ఎంత ఆదాయం వచ్చిందో తెలియదు కానీ.. అదే పంథాను ఫాలో అయిన ఈ చోరుడు మాత్రం గట్టిగానే దండుకున్నాడు. ఆ రాజరాజచోరుడు, అతడి చోరసైన్యం, చోరతంత్రం.. తెలిస్తే విస్తుపోవటం పక్కా..!
ఈ ఏడాది మార్చి 7 తెల్లవారుజామున హైదరాబాద్ ఎల్బీనగర్లోని రాక్‌టౌన్ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదు పోయింది. అదే కాలనీలోని ఓ ఫార్మసీ కార్యాలయంలోనూ నగదు చోరీ అయ్యింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల వేట ప్రారంభించారు. ఎప్పటిలాగే.. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా.. నిందితుల ఆనవాళ్లు గుర్తించారు. నిందితులు హోండా యాక్టివా స్కూటీ వాడినట్టు దృశ్యాల్లో కనిపించటంతో.. బండి ఆధారాలతో జగన్నాథ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా.. మరోకరు పరారీలో ఉన్నాడు. నిందితుని దగ్గర నుంచి 440 గ్రాముల బంగారు ఆభరణాలు, 568 గ్రాముల వెండి, 25 వేల నగదు, ఓ కారు, 21 యూఎస్ డాలర్లు, 26 చేతి గడియారాలు, ఆరు మొబైల్ ఫోన్లు, స్క్రూడైవర్ స్వాధీనం చేసుకున్నారు. వీటన్ని విలువ 32 లక్షలకు పైమాటే. ఇదంతా ఎలా చేస్తున్నారని పోలీసులు.. వాళ్ల స్టైల్లో జగన్నాథ్‌ను విచారించగా.. మొత్తం కథ బయటపడింది.
కర్ణాటకలోని కడిగహడ్డి గ్రామానికి చెందిన జగన్నాథ్(28) ఓ కారు డ్రైవర్. దోపిడీలు, దొంగతనాలు చేయటంలో మంచి నిపుణుడు. 2017, 2019, 2021లో వేర్వేరు ప్రాంతాల్లో కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు. 2022 ఫిబ్రవరి 10న బెయిల్‌పై బయటకు వచ్చాక మళ్లీ చోరీల బాట పట్టాడు. అయితే.. ఘరానాదొంగ అయిన ఈ జగన్నాథ్ కేవలం పాత్రధారి మాత్రమే.. అసలు సూత్రధారి మాత్రం పరారీలో ఉన్న రాజశ్రీ గణేశ్. హైదరాబాద్‌లోని ఫీర్జాదిగూడకు చెందిన బ్రహ్మదేవ్ అలియాస్ బ్రహ్మదేవర రాజయ్య అలియాస్ రాజా శ్రీ గణేశే.. అసలైన రాజరాజచోరుడు. రాజశ్రీ గణేశ్‌ను 2014లో మియాపూర్, 2018లో ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గణేశ్‌పై దొంగతనాల కేసులతో పాటు వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. జైలుకెళ్లొచ్చినా పద్ధతి మారకపోవటంతో ఇతనిపై రాచకొండ పోలీసులు పీడీయాక్ట్ ప్రయోగించారు. ఏడాది పాటు జైల్లో ఉన్న గణేశ్.. బయటకు వచ్చాక.. సరికొత్త పంథాను అనుసరిస్తున్నాడు.