దొంగతనాలకు అలవాటుపడిన కోసూరి శ్రీనివాస్‌రావు అనే ప్రైవేటు ఉపాధ్యాయున్ని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో జైలుకెళ్లినప్పుడు పరిచయమైన పదిమంది నిందితులను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు ఓ న్యాయవాదిని నియమించుకున్నాడు. అతనికి ఫీజు చెల్లించేందుకు దొంగతనాలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 52 తులాల బంగారం, అర కేజీ వెండి ఆభరణాలను, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని మల్కాజ్గిరి డీసీపీ రక్షితమూర్తి పేర్కొన్నారు. రామారావుపై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 27 దొంగతనం కేసులు ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన కోసూరి శ్రీనివాస్‌రావు బీకాం వరకు చదివాడు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న సమయంలో జల్సాలకు అలవాటు పడ్డారు. అతని ప్రవర్తన సరిగా లేకపోవటంతో భార్య విడిచిపెట్టి వెళ్లిపోయింది. అక్కడి నుంచి హైదరాబాద్ నేరేడ్మెట్కు మకాం మార్చాడు. రాత్రివేళ ఇంటి తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్ట్ చేసి... జైలుకు పంపారు.