Job Fraud: ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హన్మకొండకు చెందిన పొన్నాల భాస్కర్... సికింద్రాబాద్ కార్ఖానాలో నివాసం ఉండేవాడు. రైల్వే కాంట్రాక్టు పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఇప్పిస్తూ గుత్తేదారుల దగ్గర కమీషన్ తీసుకోవడం అతనిపని. ఈక్రమంలో దిల్లీలోని కొంతమంది రైల్వే అధికారులతో పరిచయం ఏర్పడింది. ఇదే అదనుగా తనకు రైల్వే నియామక మండలి ఉన్నతాధికారులతో పరిచయాలున్నాయని పలువురు నిరుద్యోగులను నమ్మించాడు. పరీక్ష రాయకుండానే నేరుగా రైల్వేతోపాటు భారత ఆహార సంస్థలోనూ ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించాడు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 10 లక్షల వరకు వసూలు చేశాడు.
రైల్వే ఉద్యోగాల పేరుతో...
దిల్లీ, చెన్నై, అసోం, హైదరాబాద్‌లో ఏజెంట్లను నియమించుకొని భాస్కర్ ఉద్యోగాల పేరుతో మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. భాస్కర్ అనుచరుడు, సికింద్రాబాద్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి రితేష్ ద్వారా దాదాపు 16మంది నుంచి కోటి వరకు డబ్బులు వసూలు చేశాడు. డబ్బులిచ్చి... నెలలు గడిచినా ఉద్యోగాలు రాలేదని నిరుద్యోగులు ఒత్తిడి చేయడంతో.... రైల్వే ఉన్నతాధికారుల పేర్లతో పొన్నాల భాస్కర్ నకిలీ నియామక పత్రాలు అందించాడు. ఉద్యోగాల్లో చేరడానికి దిల్లీ వెళ్లినవారు మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతను... ముంబయికి మకాం మార్చాడు. పోలీసులకు చిక్కకుండా స్నేహితుల ఇళ్లలో తలదాచుకున్నాడు. జవహార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో భాస్కర్, రితేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి రూ. 9 లక్షల నగదు సహా... 25 లక్షల విలువైన రెండు కార్లు నకిలీ నియామక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్ నిరుద్యోగులను నమ్మించే క్రమంలో వారిని దిల్లీలోని రైల్వే కార్యాలయం వద్దకు తీసుకెళ్లి అధికారులతో చనువుగా ప్రవర్తిస్తున్నట్లు నటించేవాడని పోలీసులు తెలిపారు.