Punjab Drugs in hyderabad: ఓవైపు గోవా డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతుండగానే.. పంజాబ్ నుంచి డ్రగ్స్ తరలిస్తున్న మరో ముఠా పట్టుబడి ఆందోళన రేకెత్తిస్తోంది. ఇద్దరు అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల విక్రేతలను రాచకొండ మాల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. పాపిస్ట్రా కాన్సన్‌ట్రేట్, కాంట్రాబ్యాండ్, లక్షా 44 వేల నగదుతో పాటు కారు, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ను పంజాబ్ నుంచి కారులో హైదరాబాద్‌కు తీసుకువస్తుండగా... కీసర- షామీర్‌పేట్ మార్గంలో నిర్వహిస్తున్న పోలీసుల తనిఖీల్లో వీరిద్దరు పట్టుబడ్డారు.
పంజాబ్‌కు చెందిన జగ్తర్ సింగ్, జైమాల్ సింగ్ కలిసి.. కండ్లకోయ టోల్‌ప్లాజా సమీపంలో సందీప్ దాబా నిర్వహిస్తున్నారు. పంజాబ్ నుంచి తీసుకువచ్చిన డ్రగ్స్‌ను.. దాబాలో ఒకటీరెండు గ్రాముల ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నారు. పంజాబ్‌లో ఒక గ్రామును 300 రూపాయలకు కొనుగోలు చేసి... హైదరాబాద్‌లో 700కు విక్రయిస్తున్నట్టు రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. దాబా కేంద్రంగా చేసుకొని కొనసాగిస్తున్న ఈ దందాలో.. మరో నిందితుడు రంజిత్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పంజాబ్ నుంచి హైదరాబాద్‌కు మత్తుపదార్థాలను తరలించడం రాష్ట్రంలోనే ఇది తొలి కేసని సీపీ మహేశ్‌భగవత్ తెలిపారు. నిందితులు ఎవరెవరికి వీటిని సరఫరా చేస్తున్నారు..? ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగిస్తున్నారు..? అనే అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.