పద్దెనిమిదేళ్లలో 18 మంది మహిళలను కిరాతకంగా హత్య చేసిన సైకో కిల్లర్ గురించి అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కిరాతకుడు మైనా రాములు(45)కు 21 ఏళ్లకే పెళ్లయింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్లకు చెందిన ఇతని భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ కారణంతో మహిళలపై కోపం పెంచుకున్న అతను 2003 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 18 మంది మహిళలను కిరాతకంగా హత్య చేశాడు.
ఇటీవల ఘట్‌కేసర్ ఠాణా పరిధిలో జరిగిన ఓ మహిళ హత్య కేసును విచారిస్తుండగా అతని హత్యల పరంపర వెలుగులోకి వచ్చింది. గత నెల 26న నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతను చంపిన నలుగురు మహిళల ఆచూకీ ఇంకా లభ్యంకాకపోవటంతో ఆ సమాచారాన్ని రాబట్టే క్రమంలో పోలీసులు న్యాయస్థానం అనుమతితో మూడు రోజుల క్రితం కస్టడీలోకి తీసుకున్నారు. విచారిస్తున్న క్రమంలో మరిన్ని విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం.
ఖైదీలకు గురువే
రాములు గతంలో అనేకసార్లు జైలుకెళ్లాడు. ఆ సందర్భంలో తోటి ఖైదీలను శిష్యులుగా మార్చుకున్నాడు. పోలీసులకు దొరకకుండా ఎలా హత్యలు చేయాలి? జైలు నుంచి ఎలా తప్పించుకోవాలి? పోలీసు విచారణలో ఎలా వ్యవహరించాలి? అనే విషయాలపై వారికి పాఠాలు చెప్పాడు. చీకటి గది(డార్క్‌సెల్)లో బంధించినా మార్పు రాకపోవడంతో 2015 ఫిబ్రవరిలో చర్లపల్లి నుంచి వరంగల్ జైలుకు తరలించారు. అప్పటికే జైలులో ఉన్న ఓ నిందితుడికి అతను గురువుగా మారాడు. జైలు నుంచి పారిపోయే ఉపాయం చెప్పాడు. ఓ హత్యకు ప్రణాళిక కూడా గీసి ఇచ్చాడు. దాన్ని అమలు చేసిన సదరు నిందితుడు జైలు నుంచి పరారయ్యాడు. ఆయుధాలు కొనుగోలు చేసే క్రమంలో కరీనంగర్ పోలీసులకు చిక్కడంతో విషయం బయటపడింది. 2016లో ఈ కేసులో రాములును రెండో నిందితుడిగా చేర్చారు.
అతను చంపితే గుర్తుపట్టడం గగనమే
కల్లు దుకాణంలో కూర్చుని అక్కడికి వచ్చి పోయే మహిళలను ఇతను లక్ష్యంగా చేసుకునేవాడు. లైంగిక కోరికలు తీరిస్తే రూ.1000 నుంచి రూ.1500 వరకు ఇస్తానని నమ్మించి నిర్మానుష్య ప్రదేశాలకు తీసుకెళ్లి అంతమొందించేవాడు. హత్యలు చేసే క్రమంలో పోలీసులకు చిక్కకుండా తెలివిగా వ్యవహరించేవాడు. చంపిన తర్వాత తనతో తెచ్చుకున్న మద్యం ముఖంపై చల్లి నిప్పంటించి ఎవరూ గుర్తుపట్టకుండా చేస్తాడు. అతను చంపిన వారిలో నలుగురి జాడ ఇంకా తెలియరాలేదు. ఈ విషయాలన్నీ అతను తోటి ఖైదీలకు చెబుతూ వారినీ నేరాల వైపు ప్రోత్సహించేవాడని అతన్ని విచారించే క్రమంలో పోలీసులు గుర్తించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఇదీ చదవండి:అర్ధరాత్రి దొంగల బీభత్సం.. తొమ్మిది దుకాణాల్లో చోరీ