స్టాక్ బ్రోకింగ్ సంస్థ కార్వీపై (KARVY) హైదరాబాద్ సీసీఎస్‌లో (hyderabad ccs) రెండు కేసులు నమోదయ్యాయి. రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదంటూ హెచ్డీఎఫ్సీ (HDFC0, ఇండస్ ఇండ్(INDUS IND) బ్యాంకులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. షేర్లను తనఖా పెట్టి రెండు బ్యాంకుల్లో కలిపి రూ. 460 కోట్ల పైగా రుణాలు తీసుకున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ నిర్వాహకులు గత కొన్ని ఏళ్లుగా వాయిదాలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నట్లు బ్యాంకు ప్రతినిధులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో రూ.329 కోట్లు, ఇండస్ ఇండ్ బ్యాంకులో 137 కోట్లు బకాయి ఉన్నట్లు ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు తెలిపారు. 2019లో కార్వీ సంస్థపై ఫిర్యాదు రావడంతో సెబీ విచారణ జరిపి లావాదేవీలపై నిషేధం విధించినట్లు ఫిర్యాదులో వివరించారు. వినియోగదారులకు చెందిన షేర్లను కార్వీ సంస్థ సొంత అవసరాలకు వినియోగించుకుందని వెల్లడించారు. వందల కొద్ది నకిలీ షేర్లు కూడా ఉన్నాయని సెబీ నివేదికను ఆర్బీఐకి కూడా సమర్పించిందన్నారు. ఉద్దేశపూర్వకంగానే కార్వీ సంస్థ రుణాలు ఎగవేసిందని బ్యాంకు ఉన్నతాధికారులు ఆరోపిస్తున్నారు. ఈ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
గతంలోనే కార్వీపై స్టాక్ ఎక్స్ఛేంజీల వేటు
కార్వీ స్టాక్ బ్రోకింగ్‌పై ఎన్ఎస్ఈ బాటలోనే బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ పయనించింది. కార్వీని ఎగవేతదారుగా ప్రకటించింది. బీఎస్ఈలో సభ్యత్వాన్ని రద్దు చేసింది. రావాల్సిన బకాయిల కోసం 90 రోజుల్లోగా క్లెయిమ్ చేసుకోవాలని కార్వీకి చెందిన ఖాతాదారులకు సూచించింది.
కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థపై బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) సైతం వేటు వేసింది. ఆ సంస్థను ఎగవేతదారుగా ప్రకటించడమే కాకుండా... బీఎస్ఈ సభ్యత్వాన్ని రద్దు చేసింది. కార్వీ నుంచి రావాల్సిన బకాయిలు ఏవైనా ఉంటే 90 రోజుల్లోగా క్లెయిమ్ చేసుకోవాలని మదుపర్లకు సూచించింది. గతేడాది నవంబర్ 24 నుంచి ఈ ఆదేశాలు అమలులోకి వచ్చినట్లు పేర్కొంది.