Agricultural Co Operative Society Loans Fraud: మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి పంట రుణాలు బకాయిపడ్డ రైతుల జాబితా ఇటీవల బయటకు వచ్చింది. రెడ్డిపల్లి గ్రామంలో బకాయిపడ్డ రైతుల జాబితా అనుమానాలకు తావిస్తోంది. ఈ జాబితాలో 44వ క్రమసంఖ్యలో దోమ బాల్‌రెడ్డి అనే రైతు 2017లో 21వేల రుణం తీసుకుని వడ్డీతో సహా 36వేల240 రూపాయలు బకాయి పడ్డట్లు ఉంది. కానీ దోమ బాల్‌రెడ్డి 2013లోనే మృతి చెందారు. 2013లో చనిపోయిన ఆయన 2017 ఎలా రుణం తీసుకుంటారని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
తన తండ్రి పేరిట మంజూరైన రుణం ఎవరు తీసుకున్నారని ఆయన కుమారుడు వాపోతున్నారు. కొంతమంది అమాయకులు, చనిపోయిన రైతుల పేరిట పంట రుణాలు మంజూరీ చేయించి.. ఆ సొమ్మును సొసైటీ సిబ్బందే కాజేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క రెడ్డిపల్లి గ్రామంలోనే సుమారు 13మంది చనిపోయిన రైతుల పేరిట 2017లో రుణాలు మంజూరైనట్లుగా జాబితా చెబుతోంది. తాము రుణాలు తీసుకోకపోయినా తీసుకున్నట్లుగా జాబితాలో ఉందని మరికొందరు రైతులు ఆరోపిస్తున్నారు.
"మా నాన్న పేరు నర్సింహులు 2015లో చనిపోయారు. సోసైటీలో లోన్ ఉన్నట్లు మాకు మెసేజ్ వచ్చింది. 2017లో మా నాన్న పేరు మీద లోన్ తీసుకున్నట్లు నోటీస్ వచ్చింది. మొత్తం 3 లక్షల 3వేలు అప్పు ఉన్నట్లు చూపిస్తోంది".-మహేష్,రెడ్డిపల్లి
చనిపోయిన వ్యక్తుల పేరిట రుణాలు: చనిపోయిన వ్యక్తుల పేరిట రుణమెలా తీసుకున్నారని కుటుంబ సభ్యులు సిబ్బందిని ప్రశ్నిస్తే బకాయిలు చెల్లించమని అడగటం లేదుగా అంటున్నారే తప్ప సరైన సమాధానం ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారు. రైతులు రుణాలు బకాయిపడితే సొసైటీ ఊరుకోదు. బకాయిలు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేస్తుంది. కానీ ఇన్నేళ్లు సొసైటీ సిబ్బంది బకాయిలు కట్టాలని అడగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రైతులకు తెలియకుండా వారి పేరు మీద సిబ్బందే రుణాలు కాజేశారని.. రుణమాఫీలో అవి మాఫీ కావడంతో వాటిని చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.