తెలంగాణ

telangana

ETV Bharat / crime

Rape On Child: అందరు అనుమానించిందే నిజమైంది.. చిన్నారిని వాడే చిదిమేశాడు.. - ఆరేళ్ల చిన్నారిపై రేప్​

postmortem-report-released-that-the-child-was-raped
postmortem-report-released-that-the-child-was-raped

By

Published : Sep 10, 2021, 5:06 PM IST

Updated : Sep 10, 2021, 9:07 PM IST

17:02 September 10

ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి చంపినట్టు పోస్టుమార్టం నివేదిక

అప్పటి వరకు ఇద్దరు తమ్ముళ్లు, అమ్మతో ఆడుకున్న చిన్నారి ఇంటి బయటికి వెళ్లింది. పక్కింట్లో ఉండే అంకుల్ చాక్లెట్ ఇస్తానంటే గదికి వెళ్లింది. తనకేం తెలుసు అంకుల్​లో మానవమృగం దాగి ఉందని. ఆ ముక్కుపచ్చలారని చిన్నారిని ఆ మృగం చిదిమేసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాడు.. అభంశుభం తెలియని ఆరేళ్ల అమ్మాయికి చాక్లెట్​ ఆశచూపి.. పశువాంఛ తీర్చుకుని కడతేర్చాడు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌ సైదాబాద్‌ సింగరేణి కాలనీలో అదృశ్యమైన బాలిక.. అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో పక్కింట్లోనే విగతజీవిగా కన్పించింది. స్థానికులు అనుమానం వ్యక్తం చేసినట్టుగానే... నిందితుడు అత్యాచారం చేసి చంపేసినట్టు పోస్టుమార్టం నివేదిక తేల్చింది.  

అంతా జల్లెడ పట్టారు.. కానీ పక్కింట్లోనే..

నిన్న సాయత్రం నాలుగు- ఐదు గంటల మధ్య బయటకు వెళ్లిన చిన్నారి తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు కాలనీ అంతా జల్లెడ పట్టారు. తెలిసినవాళ్లు, స్థానికుల సాయంతో.. అంతా వెతికారు. 9 గంటల సమయంలో పామ మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుసు కూడా కాలనీ చుట్టుపక్కల వెతికారు. పక్కన గదిలో ఉండే రాజు కనిపించకపోవడంతో అతడిపై బాలిక తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. రాజు కోసం వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో... రాత్రి 12 గంటల సమయంలో గది తాళాలను పగులగొట్టారు. ఆ తల్లిదండ్రులు ఏదైతే జరగకూడదు అని బలంగా కోరుకున్నారో అదే వాళ్ల కళ్లేదుట కనిపించింది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిన్నారి విగతజీవిగా కనిపించింది. ఆ బుజ్జాయిని ఆ స్థితిలో చూసి.. తల్లిదండ్రులు బోరుమన్నారు. స్థానికులంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అనుమానాస్పద స్థితిలో ఉన్న చిన్నారి మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డట్టు ఆరోపించారు. చిన్నారిపై దురాఘతానికి పాల్పడ్డాడన్న ఆలోచనే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది. "ఆ మానవమృగాన్ని మాకు అప్పగిస్తారా...? మీరే ఎన్​కౌంటర్​ చేస్తారా..?" అంటూ కోపంతో ఊగిపోయారు. 

చంపాపేట్​లో ఉద్రిక్తత..

ఉదయం 7 గంటలకు చంపాపేట్ వద్ద సాగర్ రోడ్డుపై కాలనీవాసులంతా నిరసనకు దిగారు. అభం శుభం తెలియని చిన్నారిని పొట్టనబెట్టుకున్న నిందితుడు రాజును ఎన్​కౌంటర్​ చేయాలని లేదా తమకు అప్పగించాలని డిమాండ్​ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. కాలనీవాసులకు నచ్చజెప్పే క్రమంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదే క్రమంలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో చంపాపేట్​ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఆందోళన మధ్యే.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 

అందరూ ఆరోపించినట్టుగానే...

కాలనీవాసులు ఆరోపించినట్టుగానే.. పోస్టుమార్టం నివేదిక వెల్లడైంది. చిన్నారిపై ఆ మానవమృగం అత్యాచారం చేసి... హత్య చేసినట్టు తేలింది. చిన్నారిని అత్యాచారం చేసి ఆపై గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. చిన్నారి ఇంటి పక్కన గదిలో నివాసం ఉండే రాజు ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. సొంత గ్రామానికి తీసుకెళ్లి అశ్రునయనాల మధ్య చిన్నారి అంత్యక్రియలు నిర్వహించారు.

చాక్లెట్​ ఆశ చూపి...

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురుకు చెందిన రాజుకు వివాహమైంది. ఆరు నెలలుగా సైదాబాద్​లోని కాలనీలో నివాసం ఉంటున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైన రాజు వేధింపులు తట్టుకోలేక.. భార్య అతడిని వదిలి వెళ్లిపోయింది. కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న రాజు... చిల్లర దొంగతనాలు కూడా చేశాడు. నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి గదిలోకి తీసుకెళ్లిన రాజు.... హత్యాచారం చేశాడు. ఆపై గొంతు నులిచి చంపేశాడు. చిన్నారి మృతదేహాన్ని పరుపులో చుట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేద్దామని నిందితుడు భావించినప్పటికీ... వీలు కాకపోవడంతో గదిలో పెట్టి తాళం వేసి వెళ్లినట్టు పోలీసులు నిర్ధరించారు. పరారీలో ఉన్న నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుడి కోసం సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. రాజు కుటుంబసభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజు గురించిన వివరాలపై కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నారు.

శిక్షపడేలా చూస్తాం: కలెక్టర్​

హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ సైదాబాద్ ఠాణాలో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నారు. అదనపు సీపీ చౌహాన్ రాస్తారోకో జరుగుతున్న ప్రదేశానికి వచ్చి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. హైదరాబాద్​ కలెక్టర్​ శర్మన్.. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని​ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సాయం కింద రూ.50 వేల చెక్ అందించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని.. రెండు పడక గదుల ఇల్లు, పొరుగు సేవల ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. సింగరేణి కాలనీలో బెల్ట్ షాపులు, గుడుంబా లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

'ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడిని వదిలేదు లేదు. సాధ్యమైనంత తొందరగా నిందితుడికి శిక్ష పడేలా చూస్తాం. బాధిత కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.50 వేలు అందించాం. డబుల్​ బెడ్​ రూం ఇల్లు కేటాయించేలా చూస్తాం. పొరుగు సేవల ఉద్యోగం ఇప్పిస్తాం.' -శర్మన్​, హైదరాబాద్​ కలెక్టర్

ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు డీసీపీ రమేశ్​రెడ్డి. బాలిక మృతదేహాన్ని తరలించే సమయంలో పోలీసులకు గాయాలయ్యాయని చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకని.. ఫాస్ట్​ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన శిక్ష పడేలా చూస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. కలెక్టర్​, పోలీసుల హామీతో ఆందోళనకారులు శాంతించారు.

ఎమ్మెల్యే అభ్యర్థన...

సీపీ అంజనీ కుమార్​ను కలిసిన యాకుత్​పురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి... నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటన తీరును సమీక్షించేందుకు సైదాబాద్ కూడలి వద్ద ఉన్న మలక్​పేట ఏసీపీ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా సీపీని ఎమ్మెల్యే కలిశారు. దారుణ నేరానికి పాల్పడిన నిందితునికి వేగంగా కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రెండు పడక గదుల ఇల్లు, కుటుంబ సభ్యుడికి ప్రభుత్వ ఉద్యోగం, పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే అభ్యర్థించారు.

సంబంధిత కథనాలు..

Last Updated : Sep 10, 2021, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details