తెలంగాణ

telangana

ETV Bharat / crime

Cyber Crime: తక్కువ ధరకే ప్లాట్‌ విక్రయం.. నిండా ముంచేస్తున్న అక్రమార్కులు! - తెలంగాణ వార్తలు

మీ ప్లాట్‌(ఖాళీ స్థలం)ను విక్రయిస్తామంటూ ప్రకటనలిస్తున్నారా? తక్కువ ధరకే ప్లాట్‌ అమ్ముతామంటూ మీకు ఎవరైనా ఫోన్‌ చేస్తున్నారా?.. అయితే ఒక్క క్షణం ఆలోచించండి. ప్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు రోజుకో రీతిలో తెర లేపుతున్నారు. అందుకే అప్రమత్తత అవసరం.

cyber crime with plot sales, fraud sales in plot sales
ప్లాట్ల అమ్మకం పేరిట మోసం, స్థిరాస్తి వ్యాపారంలో సైబర్ నేరాలు

By

Published : Aug 16, 2021, 1:26 PM IST

ధనార్జనే ధ్యేయంగా అక్రమార్కులు రోజుకోరీతిలో మోసాలకు తెర లేపుతున్నారు. తక్కువ ధరకే ప్లాట్‌ విక్రయిస్తామంటూ మీరు ప్రకటనలు ఇస్తున్నా... లేదా తక్కువ ధరకే ప్లాట్‌ అమ్ముతామంటూ వచ్చే ఫోన్ల పట్ల అప్రమత్తం కావాల్సిందే. లేదంటే మోసపోవడం ఖాయమని హైదరాబాద్‌ రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ తరహాలో మోసాలకు పాల్పడుతున్న ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన సల్వాడి నాగరాజు(37)ను ఇటీవల అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సుమారు 20 మంది నుంచి రూ.2 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు తెలుసుకుని కంగుతిన్నారు.

పత్రాలను ఎలా సంపాదిస్తున్నారంటే...

ప్లాట్లను విక్రయిస్తామంటూ కొందరు వివిధ మాధ్యమాల్లో ప్రకటనలిస్తున్నారు. మోసగాళ్లు ఆ మాధ్యమాల నుంచి యజమానుల ఫోన్‌ నంబర్లను తీసుకుని వారికి ఫోన్‌ చేస్తున్నారు. రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు అడ్వాన్స్‌(టోకెన్‌ అమౌంట్‌) చెల్లించి.. ఆ స్థలానికి సంబంధించిన పత్రాలను వాట్సప్‌ ద్వారా తీసుకుంటున్నారు. ఆ తర్వాత నుంచి అక్రమాలు తెరలేపుతున్నారు. మా అమ్మకు బాగోలేదు.. నాన్న ఆసుపత్రిలో ఉన్నాడు.. అత్యవసరంగా డబ్బులు కావాలి.. రూ.కోటి విలువైన స్థలాన్ని రూ.70 లక్షలకే విక్రయించాలనుకుంటున్నా అంటూ స్థిరాస్తి వ్యాపారులు, మధ్యవర్తులు, ప్రముఖులకు అసలు యజమాని పేరుతో ఫోన్లు చేస్తున్నారు. తక్కువకే వస్తుంది కదా అంటూ చాలా మంది ముందు వెనకా ఆలోచించకుండా టోకెన్‌ అమౌంట్‌గా రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు చెల్లిస్తున్నారు.

అంతా ఫోన్లలోనే..

మొదటి నుంచి చివరిదాకా ఎక్కడా మోసగాళ్లు కంటికి కనిపించకుండా ఫోన్లలో నడిపిస్తుంటారు. టోకెన్‌ అమౌంట్‌ చెల్లించిన వారికి స్థలానికి సంబంధించిన పత్రాలను వాట్సప్‌లో పంపిస్తున్నారు. వారు ఆ పత్రాలను కార్యాలయాల్లో తనిఖీ చేయించుకుంటున్నారు. అక్కడ వివరాలు సక్రమంగానే ఉంటున్నాయి. క్షేత్రస్థాయిలోనూ స్థలం ఉండటంతో అనుమానం రావడం లేదు. రిజిస్ట్రేషన్‌ సమయానికి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు. పత్రాల్లో ఉన్న చిరునామాకెళ్లి నిలదీస్తే.. అప్పుడు అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. ఈ అక్రమార్కులు అంతకు ముందే తమకు ఆసక్తి లేదంటూ అసలు యజమానులకు కట్టిన డబ్బులను వెనక్కు తీసుకుంటున్నారు. ఈ తరహాలోనే ఓ ప్రముఖుడి నుంచి రూ.15 లక్షలు, మరో వ్యక్తి దగ్గర రూ.10 లక్షలు కొల్లగొట్టినట్లు రాచకొండ సైబర్‌క్రైమ్‌ పోలీసులు వివరిస్తున్నారు.

ఇదీ చదవండి: INDEPENDENCE DAY: ఓ వైపు స్వాతంత్ర్య వేడుకలు.. మరోవైపు బెల్టుషాపు వేలం

ABOUT THE AUTHOR

...view details