జోగులాంబ గద్వాల జిల్లాలో విఫల విత్తనాలతో నకిలీ విత్తనదందా నడుపుతున్న అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. జిల్లా పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందాలు చేసిన దాడుల్లో మూడు రోజుల కిందట నమోదైన కేసులో సోమవారం ఇద్దరు ఆర్గనైజర్లను పోలీసులు అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు.
విత్తనాలు స్వాధీనం
గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రమ్య ఇండస్ట్రీస్‌లో నకిలీ విత్తనాలు ఉన్నాయన్న పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు రోజుల కిందట దాడులు నిర్వయించారు. 72 సంచుల్లో 3వేల 434కిలోల విఫలమైన విత్తనాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులైన బండ్ల రాజశేఖర్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డిపై గద్వాల్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇవాళ వారిని అరెస్ట్ చేసి జ్యూడిసియల్ రిమాండ్ తరలించారు. జిల్లాలోనే పేరుమోసిన ఆర్గనైజర్లను జ్యూడీషియల్ కస్టడీకి పంపడంతో నకిలీదందా సూత్రదారులు, పాత్రదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఇన్నేళ్లు టాస్క్‌ఫోర్స్ దాడులు చేసి, కేసులు నమోదు చేసినా కొంతమంది తమకున్న రాజకీయ పలుకుబడితో తమపై కేసులు నమోదు కాకుండా, కఠిన చర్యలు తీసుకోకుండా తెరవెనక మంత్రాంగం నడిపేవాళ్లు. రాజకీయ అండదండలు, పై అధికారుల ఒత్తిళ్లు ఉండటంతో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించేవాళ్లు కాదు. ఈసారి దాడులు చేయడం, కేసులు నమోదు చేయడంతో పాటు నిందితులను అరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడీకి సైతం పంపడంతో.. అక్రమార్కుల్లో దడ మొదలైంది.