తెలంగాణ

telangana

ETV Bharat / crime

పబ్‌లపై పోలీసుల కొరడా.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు తప్పదు - police action on pubs

Police Action on Pubs: ఇష్టారీతిన వ్యవహరిస్తున్న పబ్‌లపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వాటిపై కేసులు నమోదు చేస్తున్నారు. పరిమితికి మించిన శబ్ధంతో అర్ధరాత్రి వరకు నడిచే పబ్‌లలోని డీజే పరికరాలను సీజ్ చేస్తున్నారు. నిర్వాహకులపైనా కేసులు నమోదు చేస్తున్నారు.

pub
pub

By

Published : Oct 25, 2022, 7:08 AM IST

Police Action on Pubs: పాశ్చాత్య పోకడలలో భాగంగా హైదరాబాద్‌లో పలు చోట్ల పబ్‌లు వెలిశాయి. మందు బాబులను ఆకట్టుకునే విధంగా బార్లను అలంకరించి అదనపు హంగులు ఏర్పాటు చేసి వాటినే పబ్‌లుగా నడిపిస్తున్నారు. పబ్‌లకు వచ్చేవారిని ఆకర్షించడం కోసం సంగీత విభావరిలతోపాటు.. డీజేలతో పాటలు పెడుతున్నారు. అర్ధరాత్రి వరకు ఆటపాటలు, అరుపులు, కేకలతో హోరెత్తిస్తున్నారు.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలి, మియాపూర్ ప్రాంతాల్లో చాలా చోట్ల ఇళ్ల మధ్యే పబ్‌లు ఏర్పాటయ్యాయి. అక్కడికి వచ్చేవారు ఇళ్ల మధ్యే పార్కింగ్ చేసి వెళ్లడం... మద్యం సేవించి బయటికి వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో స్థానికులతో గొడవపడం జరుగుతోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌కు చెందిన కొంతమంది పబ్‌ల నిర్వహణపై హైకోర్టును ఆశ్రయించారు. భారీ శబ్ధాలతో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని... వాహనాలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసి.. సమస్యలు సృష్టిస్తున్నారని వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించి సెప్టెంబర్‌లో తీర్పునిచ్చింది.

పబ్‌లలో నిబంధనలకు అనుగుణంగా సౌండ్ సిస్టమ్ ఉండాలని... రాత్రి 10దాటిన తర్వాత భారీ శబ్దాలు వెలువడకుండా చూసుకోవాలని ఆదేశించింది. ఇళ్ల మధ్య పబ్‌లను నిర్వహించొద్దని.. వాహనాల పార్కింగ్ విషయంలో తగిన ఏర్పాట్లు ఉండాలని తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించే పబ్‌లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.

దాడులు ముమ్మరం: ఈ నెల మొదటి వారంలో సైబరాబాద్ పోలీసులు పబ్‌లపై దృష్టి సారించారు. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం పోలీస్ స్టేషన్ల పరిధిలోని 20 పబ్‌లలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. గచ్చిబౌలి వట్టినాగులపల్లిలోని జీరో-40, ఎఎంబీ మాల్‌లో ఉన్న ఎయిర్ లైన్, రాయదుర్గం పీవీఆర్ ఆత్రేయ అపార్ట్‌మెంట్స్ వద్ద ఉన్న బెర్లిన్ పబ్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బెర్లిన్ పబ్ యజమాని వెంకట్‌రావుతోపాటు మిగతా పబ్‌లకు చెందిన సిబ్బంది, డీజే ప్లేయర్లపైనా కేసులు పెట్టారు. మొత్తం 8 మందిపై కేసులు నమోదు చేశారు. డీజీ సౌండ్ కోసం ఉపయోగించే పలు పరికరాలు సీజ్ చేశారు.

ఈ నెల10న గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శరత్ సిటీ కేపిటల్ మాల్ వద్ద ఉన్న ఎయిర్ లైవ్ బార్‌లో ఎస్​వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భారీ శబ్ధం వెలువడే విధంగా డ్రమ్స్ ప్లే చేస్తున్నట్లు గుర్తించారు. పబ్ యజమాని అతిన్ అగర్వాల్‌తోపాటు మేనేజర్, సిబ్బంది ఏడుగురిపై కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అమ్నీషియా పబ్‌లో తనిఖీ చేసిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘించడంతో కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో కలిపి 70కిపైగా పబ్బులున్నాయి. ప్రతి పబ్‌లోనూ నిబంధనలు పాటించేలా చూడాలని హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ ఉన్నతాధికారులను హైకోర్టు ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details