Jubilee hills gang rape case updates : సంచలనం రేకెత్తించిన జూబ్లీహిల్స్‌లో బాలిక సామూహిక అత్యాచార ఘటనపై మరింత స్పష్టతకోసం పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. మే 28న జూబ్లీహిల్స్ పబ్‌లో బాలికను ట్రాప్ చేసిన నిందితులు పక్కా పథకం ప్రకారం కారులో తీసుకెళ్లి నిర్జన ప్రదేశంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ నెల 31న ఈ ఘటన వెలుగు చూసింది. తర్వాత మూడు రోజులపాటు ఆరుగురు నిందితులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రోజుకో ప్రాంతం మారుతూ మొబైల్ ఫోన్లు, సిమ్‌కార్డులు మారుస్తూ పోలీసులను ఏమార్చారు. ఈ వ్యవహారంలో నిందితులను తప్పించేందుకు తెర వెనుక సహకరించిన పెద్దలు ఎవరనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. జూబ్లీహిల్స్ పోలీసుల కస్టడీలో ఉన్న సాదుద్దీన్ మాలిక్(18)ను శుక్రవారం బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ సుమారు అర గంట ప్రశ్నించారు. బెంజ్‌కారు నుంచి ఇన్నోవా కారులోకి బాలికను మార్చటానికి గల కారణాల గురించి ప్రధానంగా ఆరా తీశారు. తప్పించుకు పారిపోయిన నిందితులు మూడు రోజులు ఎక్కడున్నారు? నిందితులను అప్రమత్తం చేస్తూ వచ్చింది ఎవరు? అనే వివరాలు రాబట్టే దిశగా ఆయన విచారణ సాగినట్టు సమాచారం. దీనికి నిందితుడు పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది.
వీడియో తీసింది ఎవరు.. మైనర్లను ప్రశ్నించిన పోలీసులు..ఇదే ఘటనలో నిందితులైన ముగ్గురు మైనర్లను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జువెనైల్ న్యాయస్థానం ఆదేశాల ప్రకారం అయిదు రోజుల కస్టడీలో భాగంగా తొలిరోజు జువెనైల్ హోంలోని ప్రత్యేక గదిలో మామూలు దుస్తుల్లోనే పోలీసులు ప్రశ్నించారు. కొద్ది సమయం ముగ్గుర్నీ ఒకేసారి, తరువాత వేర్వేరుగా విచారించారు. బెంజ్, ఇన్నోవా కార్లలో జరిగిన ఉదంతాన్ని వీడియోలో చిత్రీకరించింది ఎవరు? సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిందెవరు? అనే వివరాలు సేకరించారు. వీడియోలు, ఫొటోలను ముందుగా ఎవరికి పంపారనే దానిపైనా ఆరా తీశారు. పోలీసులు ప్రశ్నించే సమయంలో వారంతా దిక్కులు చూస్తూ కూర్చున్నట్లు తెలుస్తోంది. అత్యాచారానికి పథకం ఎవరిది? పార్టీకి ఆహ్వానించిందెవరు? వేడుక ముగిశాక ఏం జరిగింది? తదితర వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారు.