నారాయణపేట జిల్లా ముక్తల్ పట్టణ శివారులో గత నెల 29న హత్యకు గురైన మహిళ కేసును పోలీసులు ఛేదించారు. జిల్లాలోని పంచదేవ పహాడ్ గ్రామానికి చెందిన అంజిలమ్మ(45), గద్వాల జిల్లాకు చెందిన ఆలె విష్ణు (51)లు కలిసి ఆమెను హత్య చేసినట్లు గుర్తించారు.
అంజిలమ్మ, విష్ణు కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. తనకు వెండి నగలు చేయించాలని మహిళ కోరడంతో వారిద్దరి మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. వారి మిత్రురాలైన చిట్యాల లింగమ్మ వద్ద 60 తులాల వెండి ఉండడాన్ని గమనించిన ఇద్దరూ ఎలాగైన ఆమెను హత్య చేసి వెండిని కాజేయాలని నిర్ణయించుకున్నారు. ఆ క్రమంలో మార్చి 29న లింగమ్మను తీసుకుని అంజిలమ్మ ముక్తల్ పట్టణ శివారులోని పంప్‌హౌస్ వద్దకు వెళ్లింది. తర్వాత ద్విచక్రవాహనంపై విష్ణు అక్కడికి చేరుకున్నాడు. వారంతా అక్కడ మద్యం సేవించారు. అనంతరం విష్ణు, అంజిలమ్మ కలిసి లింగమ్మను కత్తితో పొడిచి మృతదేహంపై పెట్రోల్ పోసి కాల్చేశారు.