Child Kidnap Case: నిజామాబాద్ నగరంలో ఈ నెల 6(శుక్రవారం)న జరిగిన 6 నెలల పసికందు కిడ్నాప్ ఉదంతాన్ని నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీసులు ఛేదించారు. బాలుడిని అపహరించిన ఇద్దరు మహిళల నుంచి చిన్నారిని సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా పసికందును అపహరించిన ఇద్దరు మహిళలూ.. భిక్షాటన చేస్తూ జీవనం సాగించడం గమనార్హం. కేసు వివరాలను నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వరరావు వెల్లడించారు.
నగరంలో భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్న మహిళ ఈ నెల 6న ఉదయం ఆర్యనగర్‌లోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద తన బిడ్డను ఎత్తుకొని.. భిక్షాటన చేస్తూ ఉంది. ఆ సమయంలో ఆమె వద్దకు వచ్చిన ఇద్దరు మహిళలు.. ఆమెను మచ్చిక చేసుకున్నారు. తన వద్ద ఉన్న పాత బట్టలు ఇచ్చారు. కాసేపు పసికందును ఎత్తుకుంటానని చెప్పిన మహిళ.. బాబును చేతుల్లోకి తీసుకుని బాధితురాలితో పాటు ముందుకు నడిచింది. కాసేపటికి మరికొన్ని దుస్తులు తీసుకువస్తానని నమ్మించి.. ఆ ఇద్దరూ బాలుడిని తీసుకొని వెళ్లిపోయారు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో.. ఆందోళన చెందిన ఆ తల్లి స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.