నాసిరకం పొగాకుతో బ్రాండెడ్ సిగరెట్లను విక్రయిస్తూ ఐటీసీ కంపెనీకే మస్కా కొట్టేశారు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఆలంఖాన్ సోదరులు. ఆయా సిగరెట్ల ముడిపదార్థాలను సరఫరా చేస్తున్న మహ్మద్ అలంఖాన్.. తన సంపాదన కోసం బ్రాండెడ్ పేపర్లు, సిగరెట్ ఫిల్డర్లను ఎక్కువగా ముద్రించుకుని కొన్ని నెలలుగా మార్కెట్లో విక్రయిస్తున్నాడు. ఐటీసీ కంపెనీ అధికారులకు అనుమానం వచ్చేంత వరకూ ఈ వ్యవహారం జరుగుతోందని తెలీదు. ట్రూప్ బజార్లోని అలంఖాన్ గోదాంలో నాలుగురోజుల క్రితం పోలీసులు దాడులు చేసి రూ.2 కోట్ల విలువైన సిగరెట్లకు ముడిపదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అలంఖాన్ సోదరులు పారిపోవడంతో కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఐటీసీ కంపెనీతో పాటు వేరే కంపెనీల సిగరెట్లూ ఇలాగే చేస్తున్నారా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు.
సినిమాను తలపించే డెన్
పొగాకు ఉత్పత్తుల్లో నాసిరకం ఐటీసీ సిగరెట్లు కలిసిపోయాయన్న ఫిర్యాదుతో దక్షిణమండలం టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర బృందం ట్రూప్బజార్లో అలంఖాన్ నిర్వహిస్తున్న యూసుఫ్ సప్లయింగ్ కంపెనీకి వెళ్లింది. లోపలికి వెళ్లి చూస్తే పోలీసులకు విస్తుపోయే దృశ్యాలు కనిపించాయి. సినిమాల్లో కనిపించే ప్రతి నాయకుల డెన్లా అట్టపెట్టెలు, సిగరెట్ బ్రాండ్ పేపర్లు, ఫిల్టర్లు, నాసిరకం పొగాకు సంచులు ఐదు వందలున్నాయి. ఒక్కో సంచిలో 25 కిలోల పొగాకు ఉంది. సిగరెట్లలో నాసిరకం పొగాకు నింపేందుకు ప్రత్యేక పరికరాలున్నాయి. ఇంతే కాదు.. గోదాంలో కొన్ని పాతకార్లు, వాటిల్లో కార్టన్లు ఉంచేందుకు స్థలం కూడా ఉంది. అనంతరం యూసుఫ్ సప్లయింగ్ కంపెనీకి సంబంధించిన రికార్డులను పరిశీలించగా.. ఒక్కటికూడా సక్రమంగా లేదని పోలీసులు వెల్లడించారు.