తెలంగాణ

telangana

ETV Bharat / crime

RAPE CASE: నేరం చేశాక పాడుబడిన ఇళ్లలోనే ఆ నిందితుడు!

ఏపీలోని కృష్ణా పుష్కరఘాట్‌ వద్ద అత్యాచారం కేసులో కీలక నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు కృష్ణా, గుంటూరు, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో గాలిస్తున్నాయి.

rape accused
నిందితులు

By

Published : Jun 24, 2021, 6:40 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా పుష్కరఘాట్‌ వద్ద అత్యాచారం కేసులో కీలక నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారని సమాచారం. కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న మహానాడు కరకట్ట వాసి మంగళవారం మధ్యాహ్నం తన బంధువులను కలిసి వెళ్లాడని ప్రచారం జరిగింది. అనంతరం కృష్ణా కెనాల్‌ వద్ద స్నానం చేస్తుండగా మత్స్యకారులు గుర్తించి పట్టుకోవడానికి ప్రయత్నించగా పరారయ్యాడని సమాచారం. విషయం తెలిసి పోలీసులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అప్పుడే కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వైపు వెళుతున్న గూడ్సు రైలు ఎక్కి అతడు పరారైనట్లు తెలిసి వెంబడించారు. కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వద్ద రైలు ఆగాక బోగీల్లో అణువణువునా గాలించినప్పటికీ నిష్ప్రయోజనమైంది.

కృష్ణా నది పరిసర ప్రాంతాల్లో పోలీసులకు నిందితుడి దుస్తులు దొరికాయి. నిందితుడి ఆచూకీ కోసం వారు జాగిలాలను తెప్పించారు. నేరం చేశాక పాడుబడిన ఇళ్లు, పొదల్లోనే నిందితుడు గడుపుతాడని నేర చరిత్ర ఆధారంగా తెలుసుకొని మహానాడు కరకట్టతోపాటు మంగళగిరి అటవీ ప్రాంతంలో గాలించారు. మరోసారి మంగళవారం రాత్రి 8-9 గంటల సమయంలో కృష్ణా కెనాల్‌ జంక్షన్‌ వద్ద కాల్వలో స్నానం చేస్తున్నాడని సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి గాలించారు. మంగళవారం మధ్యాహ్నంనుంచి నిందితుడి తల్లి అందుబాటులో లేదని తెలుసుకొని ఆరా తీశారు. ప్రధాన నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు కృష్ణా, గుంటూరు, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయి. యువతిపై అత్యాచారం ఘటనలో ఇద్దరు ప్రత్యక్షంగా పాల్గొన్నారని, మిగిలినవారు పడవలో ఉన్నారని భావిస్తున్నారు. ఈ కేసులో మొత్తంగా ఇప్పటివరకు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాధితురాలి డిశ్ఛార్జి
నాలుగు రోజుల చికిత్స అనంతరం బాధితురాలిని బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ప్రభావతి తెలిపారు.

ఇదీ చదవండి:KTR: సీఎం కేసీఆర్ కార్యదక్షతతో వానాకాలం పంటకు నీళ్లు

ABOUT THE AUTHOR

...view details