Police searched in Sunil Kanugulu offices: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు కార్యాలయంలో హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసుల తనిఖీలు మంగళవారం అర్ధరాత్రి వరకూ కాక రేపాయి. నోటీసులివ్వకుండా ఎందుకొచ్చారంటూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాదాపు మూడు గంటలపాటు హైడ్రామా కొనసాగింది. తాజాగా ఈ సోదాలకు సంబంధించి హైదరాబాద్ అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌మాన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
‘‘మాదాపూర్‌లోని మైండ్ షేర్ యునైటెడ్ ఫౌండేషన్ కార్యాలయంలో చాలా రహస్యంగా ఆఫీస్ పెట్టి నడుపుతున్నారు. గత ఆరు నెలల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో సోదాలు చేసి తర్వాత మెండా శ్రీప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మను అదుపులోకి తీసుకున్నాం. వీరంతా సునీల్ కనుగోలు కింద పనిచేస్తున్నట్లు సమాచారం ఉంది. ఈ ముగ్గురు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సునీల్ కనుగోలును ప్రధాన నిందితుడిగా ధ్రువీకరించాం. నిన్నటివరకు ఎవరు చేస్తున్నారనే విషయం ఎవరికి తెలియదు. వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే సునీల్ కనుగోలు ఆధ్వర్యంలోనే ఈ కార్యాలయం నడుస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం సునీల్ పరారీలో ఉన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో నోటీసులు మాత్రమే ఇచ్చాం. ఎవరినీ అరెస్టు చేయలేదు. మైండ్ షేర్ యునైటెడ్ ఫౌండేషన్ పేరుతో కార్యాలయం రిజిస్టర్ చేశారు. ఏ పొలిటికల్ పార్టీ పేరుతో రిజిస్టర్ కాలేదు’’