తెలంగాణ

telangana

ETV Bharat / crime

చనిపోతున్నానంటూ పోస్టు.. కాపాడిన పోలీసులు

అతనో సాఫ్ట్​వేర్ ఉద్యోగి.. నెలకు లక్షల్లో జీతం.. అంతా బాగానే ఉన్నా.. ఇంట్లో మాత్రం మనఃశాంతి లేదని ఆత్మహత్యకు యత్నించాడు. 'ఇంటిపోరు పడలేక ఆత్మహత్య చేసుకుంటున్నా'.. అంటూ ఫేస్​బుక్​లో పెట్టిన పోస్టు, అతని కుటుంబసభ్యుల్లో కలవరాన్ని రేపిన సంఘటన ఏపీలోని కడప జిల్లా రైల్వేకోడూరులో జరిగింది. వెంటనే వారు పోలీసులకు ఆశ్రయించగా.. సాంకేతికత ఆధారంగా అతని ఆచూకీ గుర్తించి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Software Engineer Suicide, Software Engineer Suicide, AP News
సాఫ్ట్​వేర్ ఇంజినీర్ సూసైడ్, సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ఆత్మహత్య, ఏపీ న్యూస్

By

Published : Apr 20, 2021, 12:44 PM IST

'ఇంటిపోరు పడలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నా'.. అంటూ ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు సోమవారం తెల్లవారుజామున తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఇదిచూసి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. ఏపీలోని కడప జిల్లా రైల్వేకోడూరు పోలీసులను ఆశ్రయించారు. సీఐ ఆనందరావు, ఎస్సై పెద్ద ఓబన్న తక్షణం స్పందించారు. సాంకేతికత ఆధారంగా అపస్మారక స్థితికి చేరిన ఆయన్ను గుర్తించి కాపాడారు.

బాధితుడు లింగేశ్వర యాదవ్

ఏపీలోని కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని రాంనగర్‌కు చెందిన బుర్రు లింగేశ్వర యాదవ్‌ (41) బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తుంటారు. ఆయన సోదరుడు వెంకటరమణయ్య కోడూరులో న్యాయవాది. లింగేశ్వరయాదవ్‌కు 11 సంవత్సరాల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. ఆమె కూడా అదే కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. గొడవలు ఎక్కువ కావడంతో ఇదివరకే ఆమె భర్త, ఆయన కుటుంబ సభ్యులపై కోడూరు పోలీస్‌స్టేషన్లో కేసు పెట్టారు.

ఆ కేసులో వారు ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు చేసినా వీరి కాపురం కుదుటపడలేదు. ఈ క్రమంలో తిరుపతిలో తన కుటుంబ సభ్యులతో కలిసుంటున్న భార్య.. ఈనెల 10న రైల్వేకోడూరులోని భర్త ఇంట్లోకి తన అనుచరులతో ప్రవేశించి విలువైన వస్తువులు, బంగారం తీసుకెళ్లినట్లు బాధితులు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. ఈ విషయమై భార్య తరపు వారిని అడిగేందుకని లింగేశ్వర యాదవ్‌ ఈ నెల 17న సాయంత్రం తిరుపతికి వెళ్లారు. అక్కడ ఏం జరిగిందోగాని సోమవారం ఉదయం ఆయన ‘నేను చనిపోతున్నా’ అంటూ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టినట్లు పోలీసులు వివరించారు.

ఇలా గుర్తించారు..

లింగేశ్వర యాదవ్‌ సోదరుడు న్యాయవాది వెంకటరమణయ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మొదట కానిస్టేబుళ్లను తిరుపతికి పంపి ఆయన భార్య, బంధువుల ఇళ్లలో వెతికించారు. ఈలోపు ఆయన చరవాణిని ట్యాప్‌ చేశారు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ రావడంతో సాంకేతిక శాఖకు సమాచారం అందించారు. వారు లొకేషన్‌ చూసి చివరగా నెల్లూరు జిల్లా రాపూరులో ఫోను పనిచేసినట్లు చెప్పారు. అక్కడ ఆయనకు బంధువులు ఉన్నారు.

వారందరికి ఫోన్‌ చేయించగా వారు అక్కడికి రాలేదని చెప్పినట్లు ఎస్సై చెప్పారు. అక్కడి లాడ్జీలలో ఏమైనా ఉన్నారా అని వెతికించామన్నారు. ఓ లాడ్జిలో లింగేశ్వరయాదవ్‌ ఉన్నట్లు గుర్తించామన్నారు. అప్పటికే అతను నిద్రమాత్రలు తీసుకుని అపస్మారక స్థితికి చేరినట్లు వెల్లడించారు. వెంటనే ఆయన్ను అక్కడి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి తరువాత తిరుపతికి తరలించినట్లు ఎస్సై వివరించారు. ఆయన ప్రాణాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఊపిరిపీల్చుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details