Hyderabad Drug Case : డ్రగ్స్ కేసులో వ్యాపారుల కస్టడీకి కోరుతూ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాపారులను కస్టడీకి ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు ఇటీవల నిరాకరించగా... పోలీసులు రాష్ట్ర ఉన్నతన్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డ్రగ్స్ కొనుగోళ్లపై కీలక సమాచారం సేకరించాల్సి ఉందని... నిందితులను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ పిటిషన్‌పై వాదనలు పూర్తవగా.. తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
టోనీ విచారణ @ మూడోరోజు
మరోవైపు డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీని పోలీసులు టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో మూడో రోజు విచారిస్తున్నారు. టోనీని మత్తుపదార్థాల స్మగ్లింగ్‌లో అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు.. అతని కాల్‌డేటా సేకరించి పలువురితో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లో వ్యాపారవేత్తలతో సంబంధాలు, నగరంలో అతని ఏజెంట్లతో జరిపిన పైనా దర్యాప్తులో వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా, లావాదేవీలపైనా దృష్టిసారించారు. టోనీకి డబ్బు బదిలీ చేసిన బ్యాంకు లావాదేవీలపై విచారణ జరుపుతున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ సీఐ నాగేశ్వర్‌రావు... టోనీ బ్యాంకు లావాదేవీల వివరాలను పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. వాటిని అతని ముందుంచి ప్రశ్నిస్తున్నారు. టోనీని 5 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు.. ఫిబ్రవరి 2 వరకు విచారించనున్నారు.
డ్రగ్స్ కేసులో బడా వ్యాపారులు..!
హైదరాబాద్ పంజాగుట్ట మాదక ద్రవ్యాల కేసులో మరో 10 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీరిలో నలుగురు వ్యాపారులుండగా.. మరో ఆరుగురు వ్యక్తులు.. ప్రధాన నిందితుడు టోనీకి ఏజెంట్లుగా పనిచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన వాళ్లలో ఏడుగురు బడా వ్యాపారవేత్తలున్నారు. మరో నలుగురు వ్యాపారులు కూడా టోనీ దగ్గర మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసి, విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శశికాంత్, గజేంద్ర ప్రకాశ్, సంజయ్, అలోక్ జైన్ అనే వ్యాపారులు గత కొన్నినెలలుగా టోనీ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.