తమ వద్ద పెట్టుబడి పెడితే అధిక వడ్డీలు ఇస్తామని నమ్మబలికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి కోట్ల రూపాయలు మోసానికి పాల్పడ్డ శిల్పా చౌదరి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కస్టడీలో భాగంగా శుక్రవారం మొదటిరోజు నార్సింగిలోని ఎస్వోటీ కార్యాలయంలో మహిళా పోలీసు అధికారి సమక్షంలో శిల్పా చౌదరిని విచారించారు. గండిపేటలోని సిగ్నేచర్ విల్లాల్లో ఉంటున్న శిల్పాచౌదరి దంపతులు.. కిట్టిపార్టీలతో ప్రముఖ కుటుంబాలకు చెందిన మహిళలతో స్నేహం చేశారు. భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్, సినీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే లాభాలిస్తానంటూ బురిడీ కొట్టించారు. కోట్లాది రూపాయలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు మూడు కేసులు నమోదు చేసి దంపతులను అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు కస్టడీకి తీసుకున్నారు.
పక్కా ఆధారాలతో విచారించిన పోలీసులు
చంచల్‌గూడ జైలు నుంచి శిల్పాచౌదరిని నార్సింగి ఎస్వోటీ కార్యాలయానికి తీసుకు వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మహిళా పోలీసు అధికారులు ప్రశ్నించారు. పోలీసులు పక్కా ఆధారాలను నిందితురాలి ఎదుట ఉంచి విచారించారు. అయితే విచారణలో శిల్పాచౌదరి తనకేం తెలియదంటూ చెప్పే ప్రయత్నం చేశారు. బాధితులు డబ్బు ఇచ్చినట్లుగా ఉన్న కాగితాలను ఎదురుగా ఉండటంతో లాభాలు వస్తాయనే ఉద్దేశంతో వారే డబ్బును పెట్టుబడిగా పెట్టారని బుకాయించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వారి వద్ద నుంచి తీసుకున్న సొమ్మును తిరిగి ఇచ్చేశానంటూ వివరించారు. వారి వద్ద నుంచి డబ్బు తీసుకున్నట్టు.. మళ్లీ ఇచ్చినట్లుగా ఎటువంటి ఆధారాల్లేవంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. ఆమె చెప్పిన వివరాలను నార్సింగి పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. భూ లావాదేవీలకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖ నుంచి తీసుకోనున్నారు. శనివారం రెండో రోజు కస్టడీ విచాణలో భాగంగా మరిన్ని వివరాలు రాబట్టనున్నారు. పోలీసులు భావించినట్టుగా తొలిరోజు ఆమె నుంచి కీలకమైన వివరాలు బయటకు రాలేదని తెలుస్తోంది.
డబ్బంతా ఎక్కడ పెట్టారో?