తెలంగాణ

telangana

ETV Bharat / crime

నైజీరియన్​ స్మగ్లర్​ టోనీ విచారణ.. అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు..

Drugs Smuggler Tony: మాదకద్రవ్యాల కేసులో నైజీరియన్‌ స్మగ్లర్‌ టోనీని రెండో రోజు విచారించిన పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. అయిదు రోజుల కస్టడీలో భాగంగా.. అతడు వెళ్లిన పబ్‌లు, రెస్టారెంట్ల వివరాలు ఆరా తీస్తున్నారు. టూరిస్టు వీసాపై ఎనిమిదేళ్ల క్రితం ముంబయి వచ్చిన అతడు... నైజీరియన్‌ స్మగ్లర్ల పరిచయంతో మత్తుపదార్ధాల వ్యాపారంలోకి ప్రవేశించినట్లు విచారణలో వెల్లడించినట్టు సమాచారం.

By

Published : Jan 31, 2022, 4:20 AM IST

నైజీరియన్​ స్మగ్లర్​ టోనీ విచారణ.. అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు..
నైజీరియన్​ స్మగ్లర్​ టోనీ విచారణ.. అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు..

Drugs Smuggler Tony: దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో మత్తు దందా నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల స్మగ్లర్‌ టోనీని పోలీసులు కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నారు. ఏ విధంగా మాదకద్రవ్యాల సరఫరాదారుడిగా మారాడు?.. ఎవరెవరు అతనికి సహకరించారు?.. ఏజెంట్లు ఎవరు?.. వంటి వివిధ అంశాలపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారిస్తున్నారు. 2013లో అతడు ముంబయి చేరుకుని.. కొంతమంది నైజీరియన్‌ స్మగ్లర్ల సాయంతో మత్తుదందాలోకి దిగినట్టు బయటపడింది. కొద్దికాలంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బలమైన నెట్‌వర్క్‌ ఏర్పరచుకుని అంతర్జాతీయ స్మగ్లర్‌ స్టార్‌బాయ్‌ సంస్థతో సంబంధాలు కొనసాగించాడు. రెండోరోజు విచారణలో పోలీసులు స్టార్‌బాయ్‌తో కొనసాగించిన లావాదేవీలపై ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ముంబయి కేంద్రంగా ఏళ్ల తరబడి మాదకద్రవ్యాల దందా సాగించిన టోనీ ఎక్కడా వ్యక్తిగత ఆధారాలు దొరకకుండా జాగ్రత్తపడ్డాడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారానే లావాదేవీలు నిర్వహించాడు.

ఇమ్రాన్‌బాబు షేక్‌తో మాత్రమే ప్రత్యక్ష సంబంధాలు

టోనీ మాదకద్రవ్యాల సరఫరాకు 20 మంది ఏజెంట్లను ఉపయోగించాడు. వీరిలో ఇమ్రాన్‌బాబు షేక్‌తో మాత్రమే ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ప్రతి నెల అతడికి లక్ష వేతనంగా ఇచ్చేవాడు. అల్తాఫ్‌ అనే మరో వ్యక్తితో ఒకటి రెండు సార్లు టోనీ ముఖాముఖి మాట్లాడినట్టు తెలుస్తోంది. మిగిలిన ఏజెంట్లకు నెలకు 20 నుంచి 30 వేలు జీతం ఇచ్చినట్టు సమాచారం. కోట్లాది రూపాయల మాదకద్రవ్యాల వ్యాపారం అంతా తానై నడిపించేవాడని దర్యాప్తులో తేలింది. ఏజెంట్లు, సబ్‌ ఏజెంట్ల నియామకం తానే పర్యవేక్షించేవాడు. టోనీ ఎవరనేది ఏజెంట్లకు తెలియదు. ఏజెంట్లతోనూ ప్రత్యక్ష సంబంధాలు నడిపేవాడు కాదని విచారణలో బయటపడినట్టు సమాచారం. ఇప్పటివరకు మత్తుపదార్థాలు సరఫరా చేసే ఏజెంట్లు, కొనుగోలు చేసే వ్యక్తుల ముఖాలు తనకు తెలియవంటూ టోనీ పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది.

కీలక సమాచారం రాబట్టిన పోలీసులు

ఏజెంట్ల ద్వారా మత్తుపదార్థాలు చేరవేసేందుకు భిన్నంగా వ్యవహరించాడు. కాఫీషాప్‌లు, రెస్టారెంట్లు, పార్కుల్లో నిర్దేశించిన ప్రాంతాల్లో కొకైన్‌ ఉంచేవాడు. సీసీ కెమెరాలు తక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని లావాదేవీలు నిర్వహించినట్టు సమాచారం. టాలీవుడ్‌తో సంబంధాలు, సినీరంగ ప్రముఖుడితో టోనీకి ఉన్న పరిచయాలపై పోలీసులు కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఆ ప్రముఖుడి ఫోన్‌నెంబరు కూడా టోనీ వద్ద దొరికిన సెల్‌ఫోన్‌లో ఉన్నట్టు సమాచారం. పోలీసుల ప్రశ్నలకు అన్నీ తానై మత్తుపదార్థాల లావాదేవీలు చేసినట్టు ఒకే సమాధానం చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇవాళ మూడోరోజు టోనీని పోలీసులు విచారించనున్నారు. విచారణలో బయటపడిన అంశాల ఆధారంగా మరింత మందిని ప్రశ్నించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details