హైదరాబాద్లోని కూకట్పల్లిలో వేర్వేరు సమయాలలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. నిజాంపేట్ రోడ్డులోని కొలను రాఘవరెడ్డి గార్డెన్ వద్ద పోలీసులు శనివారం రాత్రి 11 గంటలకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీ సమయంలో రోడ్డు ప్రమాదం జరిగిందని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేయగా... ఘటనాస్థలిని పరిశీలించేందుకు ఎస్సై సక్రమ్, ఏఎస్సై మహిపాల్ రెడ్డి వెళ్లారు.
పోలీసుల ప్రాణాల మీదికి తెస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
డ్రంక్ అండ్ డ్రైవ్ సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రజల కోసం నిర్వహిస్తున్న తనిఖీలు... పోలీసుల ప్రాణాల మీదికే వస్తున్నాయి. పూటుగా మద్యం సేవించిన వాహనదారులు.. పట్టుబడితే శిక్షలు తప్పవని తప్పించుకునే క్రమంలో విధులు నిర్వహిస్తున్న పోలీసుల పైకి వాహనాలను పోనిచ్చి గాయపరుస్తున్నారు.
అదే సమయంలో అటుగా వచ్చిన అస్లాం అనే వ్యక్తి.... కారుతో దూసుకొచ్చాడు. మద్యం మత్తులో దొరికితే శిక్ష పడుతుందని తప్పించుకునే ప్రయత్నంలో ఒక్కసారిగా పోలీసులపైకి కారును పోనిచ్చాడు. ఈ క్రమంలో మహిపాల్ రెడ్డి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఏఎస్సై ప్రాణాపాయస్థితిలో ఉండగా... కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ఆ ప్రాంతంలో మరో వ్యక్తి సృజన్... తనిఖీలు తప్పించుకునే క్రమంలో హోంగార్డులను ఢీకొట్టాడు. ఈ ఘటనలో హోంగార్డుకు స్వల్ప గాయాలయ్యాయి. హోంగార్డు స్థానిక హోలిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కూకట్పల్లి కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలో ఇలాంటివి మూడు ఘటనలు జరగ్గా... అందులో ఓ ఎస్సైకి కాలు విరిగిపోయింది.