తెలంగాణ

telangana

ETV Bharat / crime

రెమ్‌డెసివిర్‌ అక్రమ విక్రయాల్లో  నిందితుల గుర్తింపు - Nalgonda district latest news

కరోనా కేసుల్లో ప్రాణాధార ఔషధమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను అక్రమంగా సరఫరా చేసి నల్లబజారులో విక్రయిస్తున్న కేసులో హెటిరో సంస్థ మేనేజరే అసలు సూత్రధారి అని పోలీసు విచారణలో తేలింది. ఈనెల 7న రెమ్‌డెసివిర్‌ అక్రమంగా అమ్ముతుండగా టాస్క్‌ఫోర్సు పోలీసులు మిర్యాలగూడలోని శ్రీసూర్య ప్రైవేట్‌ ఆసుపత్రి ఫార్మాసిస్ట్‌ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.

Police identified the culprits in the sale of remdesivir
రెమ్‌డెసివిర్‌ అక్రమ విక్రయాల్లో నిందితులు

By

Published : May 11, 2021, 10:13 AM IST

కరోనా కేసుల్లో ప్రాణాధార ఔషధమైన రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను అక్రమంగా సరఫరా చేసి నల్లబజారులో విక్రయిస్తున్న కేసులో హెటిరో సంస్థ మేనేజరే అసలు సూత్రధారి అని పోలీసు విచారణలో తేలింది. నల్గొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా బాధితులకు అత్యవసరంగా అందించాల్సిన ఈ ఇంజక్షన్లను రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు విక్రయిస్తున్న తీరుపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు. ఈనెల 7న రెమ్‌డెసివిర్‌ అక్రమంగా అమ్ముతుండగా టాస్క్‌ఫోర్సు పోలీసులు మిర్యాలగూడలోని శ్రీసూర్య ప్రైవేట్‌ ఆసుపత్రి ఫార్మాసిస్ట్‌ నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.

ఆ ఆసుపత్రిపై దాడిచేసి డాక్టర్‌ అశోక్‌కుమార్‌ నివాసంలో 36 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభించిన సమాచారంతో టాస్క్‌ఫోర్సు పోలీసులు.. అసలు సూత్రధారులను గుర్తించారు. హైదరాబాద్‌లోని హెటిరో మేనేజర్‌ బాలకృష్ణ, ల్యాబ్‌ నిర్వాహకుడు గణపతిరెడ్డితో కలిసి ఈ దందా సాగిస్తున్నట్లు తేలింది. వీరు ఉప్పల్‌కు చెందిన శ్రీలక్ష్మీ ఏజెన్సీ ద్వారా విక్రయాలు సాగించారు. శ్రీసూర్య ఆసుపత్రి పీఆర్వో శ్రీనివాస్‌ హైదరాబాద్‌ నుంచి ఇంజక్షన్లను మిర్యాలగూడకు తీసుకొచ్చేవారు. సుమారు 138 ఇంజక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రధాన నిందితుడు బాలకృష్ణను, అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
వరంగల్‌లో 42 ఇంజక్షన్లు స్వాధీనం...

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ఐదుగురిని సోమవారం వరంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. బోడుప్పల్‌కు చెందిన చందా విజయ్‌కుమార్‌, వరంగల్‌ గ్రామీణ జిల్లా ఊరుగొండ గ్రామానికి చెందిన చింతం రాజేశ్‌, ధర్మారానికి చెందిన గట్టు అవినాశ్‌, హన్మకొండకు చెందిన ముందాటి గోపాల్‌, వావిల సురేశ్‌ ముఠాగా ఏర్పడి ఈ దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. సోమవారం వారి నుంచి 42 రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, రూ.69 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి: ఆగని పెట్రో బాదుడు- మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

ABOUT THE AUTHOR

...view details