మాల్ 008 యాప్ ద్వారా మోసాలు చేస్తున్న ఇద్దరు నిందితులు శ్రీనివాసరావు, విజయ్‌కృష్ణను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. ఈ యాప్ వెనుక ఇద్దరు చైనీయులున్నారని, వీరికీ రుణయాప్‌లతో ఇప్పటికే వేలకోట్లు దోచేసిన చైనీయులకు మధ్య సంబంధాలున్నాయని ఆధారాలు సేకరించారు. నేరగాళ్లు ఒక్క హైదరాబాద్‌లోనే రూ.32,850 కోట్ల లావాదేవీలు నడిపించినట్లు, అందులో సుమారుగా సగం దోచేసినట్లు గుర్తించారు.. ఈ సమాచారాన్ని కేంద్ర నిఘా అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు నివేదించారు. ఈ కేసుల్లో మరో ఐదుగురు చైనీయులను అరెస్ట్ చేయాల్సి ఉందని వివరించారు.
పథకం ప్రకారం సంస్థలు... కాల్ సెంటర్లు
ఆన్‌లైన్ గేమింగ్, రమ్మీ, క్రికెట్ బెట్టింగ్‌లలో రూ.వందల కోట్ల టర్నోవర్ ఉందని తెలుసుకున్న చైనీయులు.. పథకం ప్రకారం 2019 అక్టోబరులో దిల్లీకి వచ్చారు. హాంకాంగ్‌లో పనిచేస్తున్న జెన్నీఫర్, మరో ఇద్దరు చైనీయులు దిల్లీకి చేరుకుని డిసెంబరులో రుణయాప్‌ల కోసం నాలుగు సంస్థలను ప్రారంభించారు. దీనికి ముందు లింక్‌యున్, డోకీపే మరో ఎనిమిది పేర్లతో చైనీయులు ఆర్థికసేవా కంపెనీలను మొదలుపెట్టారు. చైనీయుడు యాన్‌హువో వ్యవహారాలను పర్యవేక్షించేవాడు. గతేడాది ఆగస్టులో యాన్‌హువో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు జరుగుతుండగానే జెన్నీఫర్ రుణయాప్‌ల దురాగతాలు వెలుగుచూడడంతో గతేడాది డిసెంబరులో సైబర్‌క్రైమ్ పోలీసులు చైనీయుడు ల్యాంబో సహా 16 మందిని అరెస్ట్ చేశారు.