ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు(CHANDRA BABU) నివాసం వద్ద దాడి ఘటనకు సంబంధించి.. పోలీసులు తెదేపా నేతలపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై నకరికల్లు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు... ఎమ్మెల్యే జోగి రమేష్ కారు ధ్వంసం ఘటనకు సంబంధించి తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మంపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తెదేపా కార్యకర్తలు, నేతలు గత రాత్రి నుంచి ఎక్కడెక్కడ ఉన్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. తాము ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా.. తమపైనే కేసులు పెట్టడాన్ని తెదేపా నేతలు తీవ్రంగా తప్పుబట్టారు.
CHANDRA BABU : చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తతలపై కేసులు నమోదు
తెదేపా అధినేత చంద్రబాబు(CHANDRA BABU) ఇంటి వద్ద దాడికి సంబంధించి పలువురు తెలుగుదేశం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా.. తమపైనే కేసులు పెట్టడాన్ని తెదేపా నేతలు తీవ్రంగా తప్పుబట్టారు.
ఏపీలోని గుంటూరు జిల్లా ఉండవల్లిలోని బాబు(CHANDRA BABU) ఇంటిపై దాడికి యత్నించిన పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్‌పై చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో తెదేపా శ్రేణులు ఫిర్యాదు చేశారు. కుట్ర పూరితంగా చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించిన జోగి రమేష్‌ను అరెస్టు చేయాలని పార్టీ నాయకులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. కేవలం మంత్రి పదవి కోసం తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు(CHANDRA BABU)పై దాడి చేసేందుకు యత్నించడం దుర్మార్గమని పార్టీ నాయకులు ఖండించారు. పోలీసులు న్యాయబద్దంగా విచారణ చేసి దాడిని అడ్డుకున్న తెదేపా శ్రేణులను గాయపరిచిన, జోగి రమేష్, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.