కర్ణాటకలో మాదకద్రవ్యాల వ్యవహారం(Kannada Drugs case) కలకలం రేపుతోంది. బెంగళూరులో వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన సోదాల్లో.. నటి, మోడల్, కాస్మోటిక్ వ్యాపారం నిర్వహించే సోనియా అగర్వాల్, మరో వ్యాపారవేత్త భరత్, డీజే వచన్ చిన్నప్ప ఫ్లాట్లలో డ్రగ్స్ బయటపడ్డాయి. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు. వీరందరికీ నైజీరియా డ్రగ్స్ పెడ్లర్లతో(డ్రగ్స్ విక్రయం జరిపేవారు) సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
బాత్రూంలో దాక్కున్న సోనియా..
రాజాజీనగర్‌లోని సోనియా ఇంట్లో జరిపిన రైడ్‌లో.. 40 గ్రా. గంజాయి దొరికినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో మోడల్ ఇంట్లో లేదు. ఓ హోటల్లో ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లగా.. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొనే ప్రయత్నం చేసింది సోనియా. చివరకు.. బాత్రూంలో దాక్కున్న ఆమెను బయటకు లాక్కొచ్చారు.
ఒప్పుకున్న సోనియా..
డీజే హళ్లి పోలీసుల విచారణలో నైజీరియా డ్రగ్స్ వ్యాపారి థామస్‌తో తనకు పరిచయం ఉందని ఒప్పుకొంది సోనియా. హై-ఫై పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు అంగీకరించింది. చాలా మంది రాజకీయ నాయకులు, స్టార్ నటీనటుల పిల్లలు, కథానాయికలతోనూ తనకు పరిచయాలున్నాయని చెప్పింది.
లిస్ట్ పెద్దదే..
వ్యాపారవేత్త భరత్ తన ఫ్లాట్‌లో.. డ్రగ్ పార్టీలు నిర్వహిస్తుంటాడని ఆరోపణలున్నాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు చాలా మందే అక్కడికి వెళ్తుంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ కోణంలోనూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు.
డీజే వచన్ బంధువుల ఇళ్లలోనూ గంజాయి దొరికింది. వీరిరువురికీ.. సినీ పెద్దలు తెలుసని, సినిమా ఇండస్ట్రీలో చాలా మందికే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని సమాచారం అందినట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరిని కేజీ హళ్లి, గోవిందాపుర ప్రాంతాల్లో ప్రశ్నిస్తున్నారు.
పోలీసుల కళ్లుగప్పి బాత్రూంలో దాక్కున్న నటి! ఆ సోనియా కాదు!
నటి, మోడల్ సోనియా అగర్వాల్ ఇంట్లో గంజాయి దొరికింది అనగానే చాలా మంది.. 7/G బృందావన కాలనీ ఫేమ్, ప్రముఖ డైరెక్టర్ సెల్వ రాఘవన్ సతీమణి సోనియా అగర్వాల్ అనుకున్నారు. పలు మీడియాల్లో ఇలా వార్తలు కూడా వచ్చాయి. అయితే.. వాటిని తిప్పికొట్టిందా నటి. డ్రగ్స్ కేసుతో తనకేం సంబంధం లేదని, ఆ ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విట్టర్లో ఓ ఆడియో విడుదల చేసింది.
ఇదీ చూడండి: heroin drug: రూ.100కోట్లు విలువైన డ్రగ్స్ స్వాధీనం- జైళ్ల నుంచే నేరాలు!