Bank Of Baroda Cashier case: హైదరాబాద్ వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా కేసులో నిందితుడిగా ఉన్న క్యాషియర్ ప్రవీణ్ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద ప్రవీణ్ ద్విచక్ర వాహనం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు... దానిని స్వాధీనం చేసుకున్నారు. 4 రోజులుగా కనిపించకుండా పోయిన ప్రవీణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రవీణ్ ద్విచక్రవాహనం చిట్యాల వద్ద ఉన్నందున... నిందితుడు సూర్యాపేట, కోదాడ వైపు వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా సాహెబ్ నగర్ శాఖలో రూ. 22.53 లక్షల నగదు తేడా వచ్చినట్లు మేనేజర్ వినయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం(మే 10న) మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రవీణ్ బ్యాంకు నుంచి వెళ్లిపోయాడని.... అతనిపైనే అనుమానం ఉందని వినయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రవీణ్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫోన్ స్విచాఫ్ వచ్చినట్లు మేనేజర్ పోలీసులకు తెలిపారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రవీణ్ కోసం గాలిస్తున్నారు. క్రికెట్, ఆన్లైన్ బెట్టింగ్‌లో డబ్బులు నష్టపోయినట్లు ప్రవీణ్, తన తల్లి చరవాణికి మంగళవారం రోజు సందేశం పంపినట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్ డబ్బులు గెల్చిన తర్వాతే తిరిగి విధుల్లోకి వస్తానని తోటి సిబ్బందితో ప్రవీణ్ చెప్పినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బెట్టింగ్ కోసమే ప్రవీణ్, బ్యాంకు డబ్బులు వినియోగించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.