Special Teams for Cheddi gang: విజయవాడ శివారు ప్రాంతాల్లో జరుగుతున్న వరుస చోరీలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా వారు చెడ్డీ గ్యాంగ్‌గా భావించారు. అయితే ఈ దొంగతనాలు చేస్తోంది మరో ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ తరహా దొంగతనాలకు పాల్పడే గ్యాంగ్‌లు గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉంటాయని... ఐదు నుంచి ఏడుగురు సభ్యుల ముఠా విజయవాడలో అడుగుపెట్టినట్లు అనుమానిస్తున్నారు. పాలఫ్యాక్టరీ పక్కనే అపార్ట్‌మెంట్‌లో జరిగిన చోరీ ప్రాంతంలో రెండు వేలిముద్రలు, గుంటుపల్లిలో నాలుగు వేలిముద్రలను పోలీసులు సేకరించినా...పాత నిందితుల వేలిముద్రలతో అవి సరిపోవట్లేదు.
ఒకే అవతారంలో..
vijayawada theft: పాలఫ్యాక్టరీ పక్కన జరిగిన చోరీలో 16 గ్రాముల బంగారం, రూ.లక్షను దొంగిలించారు. అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే.. నిక్కర్లు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఆయుధాలతో, ముఖానికి ముసుగేసుకుని లోపలకు వెళ్తున్నట్టు కనిపించింది. ఆ తర్వాత గుంటుపల్లిలోని నల్లూరి అపార్ట్‌మెంట్‌లో చోరీ జరిగింది. ఇదే అవతారంలో ఉన్న కొందరు అపార్ట్‌మెంట్ లోపలకు వెళ్లగా.. చప్పుడు కావడంతో వాచ్‌మెన్ విజిల్స్ వేశాడు. చుట్టుపక్కల వారంతా మేల్కొనడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ రెండు ఘటనల్లో ఒకే అవతారంలో ఉన్న వ్యక్తులు చోరీలకు దిగారు. మూడు రోజుల క్రితం పోరంకిలోని వసంతనగర్‌లో రెండు ఇళ్లలో చోరీలు జరిగాయి. ముందు రెండు చోరీల్లో ఉన్నవారే పోరంకిలోనూ చోరీకి పాల్పడ్డారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
శివారు ప్రాంతాలే టార్గెట్..!
Cheddi Gang CC Footage: నగర పరిధిలోని శాటిలైట్ రైల్వే స్టేషన్లను విజయవాడ సీపీ కాంతిరాణా స్వయంగా తనిఖీ చేశారు. శివారు ప్రాంతాల్లోని.. రహదారికి సమీపంగా ఉండే ఇళ్లను లక్ష్యంగా చేసుకొని ఈ ముఠా తమ పని పూర్తిచేసుకుంటోందని పోలీసులు భావిస్తున్నారు. పగటిపూట ఆటోలు, బస్సుల్లో ప్రయాణించి రెక్కీ చేయడం.. రాత్రివేళ చోరీ అనంతరం అక్కడి నుంచి సులువుగా పారిపోతున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శీతాకాలంలో అర్ధరాత్రి సమయంలో బయటకు వచ్చేవారు చాలా తక్కువ ఉంటారని- ఇదే అదనుగా ముఖానికి మంకీ క్యాప్ పెట్టుకుని- నేరాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్నారు.
ఆ తెగ నేర్పరి..
ఇలాంటి దొంగతనాలు చేయడంలో ఒక తెగకు చెందిన వారు నేర్పరులనే అనుమానంతో ఆ దిశగా పోలీసుల విచారణ చేస్తున్నారు. వీరు రాత్రివేళ దొంగతనాలు చేయడం... పగటిపూట జనసమర్థత తక్కువగా ఉండే రైల్వేస్టేషన్లు, శివారు ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని సంచార జాతుల మాదిరిగా జీవనం సాగిస్తుంటారన్న సమాచారంతో ఆ దిశగా పోలీసులు నిఘా పెట్టారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో ముసుగు దొంగలు చోరీలపై ఇప్పటికే కొందరి అనుమానితుల ఫోటోలను సేకరించిన పోలీసులు- వారి కదలికల కోసం మరింత ప్రత్యేక నిఘా ఉంచారు. ఓ బృందాన్ని గుజరాత్ పంపారు.